గ్రహణ సమయంలో తిరుమల, శ్రీశైలం ఆలయాలు బంద్.. ఎప్పుడంటే

తిరుమల శ్రీవారి ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ మహా ద్వారాలను డిసెంబరు 25, 26న కొన్ని గంటల సమయం వరకూ మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8గంటల 8నిమిషాల నుంచి 11గంటల 16నిమిషాల వరకూ సూర్య గ్రహణం ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా ఆలయాన్ని మూసివేస్తారు. దీని ప్రకారం.. డిసెంబర్ 25న రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను మూసేసి 26న మధ్యాహ్నం 12 గంటలకు తెరుస్తారు. 

ఆచారం ప్రకారం.. ఆలయం శుద్ధి చేసి అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. శ్రీశైలం ఆలయ మహాద్వారాలను ఇదే కారణంగా డిసెంబరు 26న కొన్ని గంటల పాటు మూసివేయనున్నారు. గ్రహణకాలం ముగిసిన తరువాత అదే రోజు ఉదయం 11:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల 30నిమిషాల వరకు దర్శనాలకు అనుమతిస్తారు. 

మంగళ, బుధవారాల్లో ‘ప్రత్యేక’ దర్శనాలు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం డిసెంబరు 17న వయోవృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను అధికారులు జారీ చేస్తారు. డిసెంబరు 18న 5 ఏళ్లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.