ఏప్రిల్ 17 నుంచి 19 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

  • Publish Date - March 26, 2019 / 06:00 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు ప్రతీ ఏడాది నిర్వహించడం ఆనవాయితీ. వసంతోత్సవాలను ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తైన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.  

రెండో రోజు (ఏప్రిల్ 18,2019)న భూదేవి సమేత మలయప్పస్వామి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వర్ణ రథం పై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఇక మూడోరోజు (ఏప్రిల్ 19, 2019)న భూదేవి స‌మేత మలయప్ప స్వామితో పాటు సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఉరూగింపుగా వెళ్లి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 

* సేవల రద్దు:
వసంతోత్సవాలు జరిగే రోజుల్లో కొన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఆ మూడు రోజులపాటు కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు TTD వర్గాలు ప్రకటించాయి.