KMC Election Results : కోల్​కతా ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం..బీజేపీ ఫ్లాప్ షో

కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన కేఎంసీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మొత్తం 144 సీట్లకు ఎన్నికలు

KMC Election Results : కోల్​కతా మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన కేఎంసీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. మొత్తం 144 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. టీఎంసీ 134 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే బీజేపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. లెఫ్ట్ 2 సీట్లు,కాంగ్రెస్ 2,ఇతరులు 3 సీట్లలో విజయం సాధించారు.

తాజా విజయంతో వరుసగా మూడోసారి కోల్​కతా పీఠాన్ని టీఎంసీ దక్కించుకున్నట్టైంది. 2015లో టీఎంసీ 131 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల శాతం విషయంలోనూ ప్రత్యర్థుల కంటే చాలా ముందంజలో ఉంది టీఎంసీ.

తాజా ఫలితాలపై టీఎంసీ అధినేత్రి, బంగాల్ సీఎం స్పందించారు. ఇది జాతీయ రాజకీయాల విజయమని అన్నారు. ప్రజలు తమ పాలనను ఆమోదించారన్నారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉమ్మడిగా తమపై పోటీ చేసినా.. సత్తా చాటలేకపోయాయని ఎద్దేవా చేశారు. ఇకపై ప్రజల కోసం, అభివృద్ధి కోసం మరింత మెరుగ్గా పనిచేస్తామన్నారు మమత. కోల్​కతాలోని అర్బన్, సెమీ అర్బన్​ల మధ్య అంతరాలను తొలగిస్తామని ఈ సందర్భంగా దీదీ పేర్కొన్నారు.

టీఎంసీ కార్యకర్తలనుద్దేశించి…ఈ నేలమీద పుట్టిన బిడ్డలం. క్షేత్రస్థాయిలో మనం పనిచేస్తాం.. గాల్లో కాదు.. అందువల్లే కోల్​కతా దేశంలోనే సురక్షితమైన నగరంగా అవతరించింది అని మమత అన్నారు. అయితే, మేయర్ పదవి ఎవరు చేపడతారనే విషయంపై మౌనం వహించారు.

ALSO READ UP Election : అమ్మాయిల పెళ్లి వయస్సు పెంపు అందుకే..అఖిలేష్ పార్టీపై మోదీ విమర్శలు

 

ట్రెండింగ్ వార్తలు