సీజేఐగా చివరి పని రోజుని ప్రత్యేకంగా ముగించిన గొగొయ్

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రంజన్ గొగొయ్ తన చివరి పనిదినాన్ని ముగించుకున్నారు. రంజన్ గొగొయ్ కి ఇవాళ(నవంబర్-15,2019)చివరి పని దినం కావడంతో ఆయన తన చివరి పని రోజుని ప్రత్యేకంగా ముగించారు. తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేయబోయే ఎస్ఏ బోబ్డేతో ఇవాళ కోర్ట్ 1లో కలిసి కూర్చున్న గొగొయ్…ధర్మాసనంలో విచారణకు లిస్ట్ అయిన పిటిషన్లు అన్నింటికి ఒకేసారి నోటీసులను ఇష్యూ చేశారు. ఇవాళ సాయంత్రం సుప్రీం ఆవరణలో గొగొయ్ కు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు,న్యాయవాదులు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. గొగొయ్ అక్టోబర్ 3, 2018న బాధ్యతలు చేపట్టగా, నవంబర్ 17, 2019న రిటైర్డ్ కానున్న విషయం తెలిసింది.

నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బోబ్డే ఇప్పటికే నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బోబ్డేను 47వ సీజేఐగా నియమిస్తూ అక్టోబర్ లో ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్-18,2019న ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్పీకరిస్తారు. కొలీజియం సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు జడ్జీల నియామకం జరుగుతుందన్న విషయం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం జడ్జీల నియామకం జరిపే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న అత్యున్నత న్యాయస్థానం జడ్జీల్లో రంజన్‌ గొగోయ్‌ తర్వాత బోబ్డే సీనియర్‌గా ఉన్నారు. 2021 ఏప్రిల్ లో బోబ్డే రిటైర్డ్ కానున్నారు. 18నెలల పాటు సీజేఐగా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.

1956,ఏప్రిల్ 24,1956లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జన్మించిన ఎస్ ఏ బోబ్డే 2000సంవత్సంలో బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా చేరారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013ఏప్రిల్ లో ఆయన సుప్రీంకోర్టుకి బదిలీ అయ్యారు. అయోధ్య భూ వివాదం,బీసీసీఐ,ఫైర్ క్రాకర్స్ కి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ల వంటి పలు ముఖ్య కేసుల్లో ఆయన విచారణ చేపట్టినవారిలో ఉన్నారు.