Punjab (1)
Punjab Politics పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కాంగ్రెస్ ను ఉద్దేశించి… సిద్ధూ స్థిరమైన వ్యక్తి కాదని,పంజాబ్ రాజకీయాలకు తగినవాడు కాదని నేను మీకు ముందే చెప్పాకదా అని అమరీందర్ ట్వీట్ చేశారు. అయితే తన మాట లెక్కచేయకుండా సిద్ధూకి పీసీసీ ఇవ్వడం మరియు తనను సీఎం పదవి నుంచి తొలగించడంపై కాంగ్రెస్ హైకమాండ్ కి ఈ విధంగా తనదైన శైలిలో చురకలంటించారు అమరీందర్.
మరోవైపు, అమరీందర్ సింగ్ ఢిల్లీ పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశ రాజధానిలో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం సాయంత్రం ఆయన భేటీ అవుతారన్నఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎంగా ఇటీవల రాజీనామా చేసిన సమయంలోనే కాంగ్రెస్‌పై అమరీందర్ బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం.. తాజా పరిస్థితులకు మరింత బలం చేకూరుస్తోంది.
కాగా.. బీజేపీలో చేరడంపై అమరీందర్‌ను మీడియా ఇటీవలే ప్రశ్నించగా.. ఆ విషయాన్ని ఆయన కొట్టిపారేయకపోగా.. నా మద్దతుదారులతో చర్చించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటా అని వెల్లడించారు.
అమరీందర్ ఢిల్లీ పర్యటనపై ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఆయన మీడియా సలహాదారు రవీన్ తుక్రల్ అన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీ వెళతున్నారని, కొందరు మిత్రులను ఆయన కలుస్తారని వెల్లడించారు. అయితే అమరీందర్ సింగ్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అమరీందర్ పార్టీ మారితే వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. మాజీ సీఎం పార్టీని వీడుతున్నారంటే అధికార పక్షానికి కొంత ఇబ్బంది కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.