మనం కారులో ఊరెళ్లేటప్పుడు హైవే మీద టోల్ గేట్లు ఫీజు చెల్లిస్తూ ఉంటాం. చెల్లించిన మొత్తానికి టోల్ గేట్ సిబ్బంది రశీదు ఇస్తుంటారు. టోల్ గేట్లలో ఇలా వచ్చిన రశీదులతో మీరు ఏమిచేస్తారు ? టోల్ గేటు దాటగానే రశీదు బయట పారేస్తారు. లేదంటే గమ్య స్ధానం చేరాక, మొత్తం మీరు ప్రయాణించిన దూరంలో ఎంత టోల్ ఫీజు చెల్లించారో లెక్క వేసుకుంటారు. అంతేనా…సహజంగా అందరూ అదే చేస్తారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.
జాతీయ రహదారులపై మీ ప్రయాణ సమయంలో మీకు లభించే రశీదులు టోల్ గేట్లను దాటడానికి ఇచ్చే పర్మిషన్ మాత్రమే కాదు. అవసరం అయినప్పుడు వాటి ద్వారా మీకు కొన్ని సౌకర్యాలు కల్పించబడతాయి. అవి ఏమిటంటారా…
హైవే పై ప్రయాణం చేస్తున్న సమయంలో మీకు అత్యవసరంగా వైద్యసహాయం కావాల్సి వస్తే రశీదు వెనుక వైపు ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. మీ కాల్ వచ్చిన 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి మీకు అవసరమైన వైద్యసహాయం అందిస్తుంది.
ఒక వేళ మీ వాహనంలో సమస్య ఏర్పడినా…. మీ వెహికల్ టైర్ పంక్చర్ అయినా, అక్కడ పేర్కొన్న ఇతర నంబర్‌కు కాల్ చేయవచ్చు. మీకు 10 నిమిషాల్లో టోల్ గేట్ సిబ్బంది నుంచి మీకు సహాయం లభిస్తుంది.
మీరు పొరపాటున చూసుకోక పోవటం వలన మీ వాహనంలో ఇంధనం అయిపోతున్నా… సమీపంలో పెట్రోల్ బంకు లేక మీరు ఇబ్బంది పడుతుంటే.. మీకు 5 లేదా 10 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ సరఫరా చేయబడుతుంది. మీకు సరఫరా చేసిన ఇంధనం కోసం వాటిని చెల్లించి పొందవచ్చు.
టోల్ గేట్ల వద్ద మీరు చెల్లించే డబ్బులో ఈ సేవలన్నీ చేర్చబడ్డాయి. చాలా మందికి ఈ సమాచారం పై అవగాహన లేదు. కాబట్టి…టోల్ గేట్ రశీదే కదా అని చించి పారేయకండి. అత్యవసర సమాయాల్లో సహాయ పడుతుంది.