Nitin Gadkari On Toll Plazas : 3 నెలల్లో.. ఆ టోల్‌ ప్లాజాలను మూసేస్తాం-నితిన్‌ గడ్కరీ

60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదని చెప్పారు. అలాంటి వాటిని మూడు నెలల్లో మూసేస్తామని తెలిపారు.

Nitin Gadkari On Toll Plazas

Nitin Gadkari On Toll Plazas : జాతీయ రహదారులపై అడుగడుగునా ఉంటున్న టోల్ ప్లాజాలు వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. అనవసరంగా అదనంగా డబ్బు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. అయితే, ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. టోల్ ప్లాజాల విషయంలో వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనదారుల జేబులపై భారం తగ్గనుంది.

కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదని… కానీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. అలాంటి వాటిని మూడు నెలల్లో మూసేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి డబ్బు వస్తోందని ఆలోచిస్తే… ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతారని మంత్రి అన్నారు.

Indian Roads: డిసెంబర్ 2024 నాటికి భారత్ లో రోడ్లు అమెరికాతో సమానంగా ఉంటాయి: నితిన్ గడ్కరీ

‘‘జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్‌ ప్లాజాలు ఉండకూడదు. కానీ కొన్ని ప్రాంతాల్లో అలా ఉన్నాయి. ఇది తప్పు. చట్ట విరుద్ధం కూడా. ఒక టోల్‌ బూత్‌కు 60 కిలోమీటర్లలోపే రెండో టోల్‌ ప్లాజా ఉంటే వాటిని మూసివేస్తాం. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా అని ఆలోచిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే వాటిని తొలగించాలని నిర్ణయించాం’’ అని గడ్కరీ అన్నారు. దీంతో పాటు టోల్‌ ప్లాజాలకు దగ్గరగా నివసించే ప్రజలు తమ ఆధార్‌ కార్డులు చూపించి పాస్‌లు తీసుకోవచ్చని గడ్కరీ తెలిపారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపులపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

చాలావరకు రహదారుల్లో కొంత దూరంలోనే రెండు మూడు టోల్ ప్లాజాలు ఉంటాయి. వాహనదారులు ప్రతీ చోటా టోల్ ట్యాక్స్ చెల్లిస్తూ రావాలి. ఇది భారంగా మారింది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం.. 60 కిలోమీటర్ల పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ టోల్ ప్లాజాలు ఉంటే వాటిని మూసివేస్తామని, మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇక ముందు వాహనదారులు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర టోల్ ట్యాక్స్ కడితే మరో 60 కిలోమీటర్ల దూరం వరకు టోల్ ప్లాజా రాదు. దీని వల్ల వాహనదారులపై కొంతవరకు భారం తగ్గనుంది. మమరోవైపు టోల్ ప్లాజాల సమీపంలోని ప్రాంతాల్లో ఆధార్ కార్డులు ఉన్నవారికి లోకల్ పాసులు ఇస్తామని నితిన్ గడ్కరీ ప్రకటించారు. కాబట్టి ఆ వాహనదారులు టోల్ ప్లాజాల దగ్గర డబ్బులు చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించొచ్చు.

ఇకపోతే, టోల్ ప్లాజాల దగ్గర డిజిటల్ పద్ధతిలో టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఫాస్ట్‌ట్యాగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 615 టోల్ ప్లాజాలు, రాష్ట్ర రహదారుల్లోని 100 పైగా టోల్ ప్లాజాల్లో ఫాస్ట్‌ట్యాగ్ పూర్తిగా అమల్లోకి వచ్చింది.