భారతదేశం తన వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలు, అంతులేని జీవవైవిధ్యంతో వన్యప్రాణి ఫొటోగ్రఫీకి నిజంగా ఒక స్వర్గధామం. ఫొటోగ్రఫీ ప్రియులు అద్భుత దృశ్యాలను బంధించేందుకు దేశంలోని అభయారణ్యాలు గొప్ప అవకాశాలను కల్పిస్తాయి.
మీకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ ఇష్టమైతే.. భారతదేశంలోని ఈ టాప్ 7 వన్యప్రాణి అభయారణ్యాలను తప్పక సందర్శించాలి.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్)
భారతదేశంలో మొట్టమొదటగా స్థాపించిన పురాతన జాతీయ ఉద్యానవనం ఇది. దికాలా జోన్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలతో ఇది పులులు, ఏనుగులు, చిరుతపులులు, జింకలు, వివిధ రకాల పక్షుల అద్భుతమైన ఫొటోలు తీయడానికి అనువైన ప్రదేశం.
కజీరంగా నేషనల్ పార్క్ (అసోం)
యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ఈ పార్క్, ప్రపంచంలోనే అతిపెద్ద “గ్రేటర్ వన్-హార్న్డ్ రైనోసిరస్” (ఒంటి కొమ్ము ఖడ్గమృగం)లకు ప్రసిద్ధి. పులులు, ఏనుగులు, మడుగు జింకలు, అడవి దున్నలు, వలస పక్షులు.. ఇవన్నీ ఇక్కడి తేమతో కూడిన మైదానాల్లో ఫొటోగ్రఫీకి అనువుగా ఉంటాయి.
రణతంబోర్ నేషనల్ పార్క్ (రాజస్థాన్)
చరిత్రాత్మక కోటలు, రాళ్లతో కూడిన ఈ ప్రాంతం, పులుల ఫొటోగ్రఫీకి పెట్టింది పేరు. పాత కోటల గోడల మధ్య స్వేచ్ఛగా తిరిగే పులులు, చిరుతలు, జింకలు, పక్షులతో ఫొటోగ్రాఫర్లు చారిత్రక నేపథ్యంతో అద్భుత చిత్రాలను బంధించవచ్చు.
బంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్)
“టైగర్ కాపిటల్ ఆఫ్ ఇండియా”గా పేరుగాంచిన ఈ ఉద్యానవనం, పులుల సాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతం. పర్వత గుట్టలు, సాల వృక్షాల అడవులు, పురాతన బంధవ్‌గఢ్ కోట కలసిన ఈ ప్రాంతం, ఫొటోగ్రఫీకి మంచి వాతావరణాన్ని అందిస్తుంది. స్లోత్ బేర్స్, బిసన్, చిరుతలు, 250కి పైగా పక్షుల జాతులు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.
పేరియార్ వైల్డ్‌లైఫ్ సంచరీ (కేరళ)
పశ్చిమ కనుమల్లో, ఒక మానవ నిర్మిత సరస్సు చుట్టూ విస్తరించిన ఈ అభయారణ్యం, బోట్-బేస్డ్ వన్యప్రాణి ఫొటోగ్రఫీకి మంచి ప్రదేశం. సరస్సు తీరంలో నీటితో ఆడుకునే ఏనుగులు, అప్పుడప్పుడు కనిపించే పులులు, రంగుల పక్షులు ఈ ప్రదేశాన్ని మరింత ఫొటోజెనిక్‌గా చేస్తాయి.
గిర్ నేషనల్ పార్క్ (గుజరాత్)
భారతదేశంలో మాత్రమే కనిపించే అరుదైన ఆసియాటిక్ సింహాల ఫొటోలు తీయడానికి ఇది ఏకైక ప్రదేశం. పొడి ఆకులు, మైదానాల్లో సింహాలు, చిరుతలు, జింకలు, నీలగాయలు, వందలాది పక్షులు నివసిస్తాయి. అడవిలోని అనేక ప్రదేశాలు తెరిచి ఉండటంతో, స్పష్టమైన వన్యప్రాణి పోర్ట్రెయిట్‌లను తీయడం సాధ్యపడుతుంది.
సుందర్బన్ నేషనల్ పార్క్ (పశ్చిమ బెంగాల్)
యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవి (Mangrove Forest) ఇది. ఇక్కడి నీటి మార్గాల్లో పడవల ద్వారా జరిగే సఫారీలు, మసక చీకట్లతో కూడిన నేపథ్యాలు ఫొటోగ్రఫీకి మంచి వాతావరణాన్ని అందిస్తాయి. నీటిలో ఈదే రాయల్ బెంగాల్ టైగర్లు, ఉప్పునీటి మొసళ్లు, ఫిషింగ్ క్యాట్స్, 250కి పైగా పక్షుల జాతులు ఇక్కడ ఉంటాయి.