మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)జరిగిన బలపరీక్షలో సీఎం ఉద్దవ్ ఠాక్రే విజయం సాధించారు. ఈ సారి మహా సింహాసం శివసైనికుడిదే అన్న మాటను వివిధ నాటకీయ పరిణామాల అనంతరం శివసేన ఎట్టకేలకు నిలబెట్టుకుంది. ఇవాళ(నవంబర్-30,2019)అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి అనుకూలంగా 169 మంది సభ్యులు మద్దతు పలికారు. ఇద్దరు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు,ఒక సీపీఐ(ఎం)ఎమ్మెల్యే,ఒక ఎమ్ఎన్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మాణానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతుతో విశ్వాస పరీక్షలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం విజయం సాధించింది. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీజేపీ దూరంగా ఉండిపోయింది. విశ్వాస పరీక్ష ప్రారంభమయ్యే సమయంలో సభ సుంచి బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సెషన్ రాజ్యాంగ విరుద్ధం,అక్రమమని అసెంబ్లీ బయట ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రొటెం స్పీకర్ నియామకం కూడా రాజ్యాంగ విరుద్థమన్నారు. సభ ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ తాము గవర్నర్ కి లేఖ ఇవ్వనున్నట్లు తెలిపారు.