బుధవారం భారత్ బంద్

బుధవారం(జనవరి-8,2020)భారత్ బంద్ కు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నారని జాతీయ కార్మిక సంఘాలు తెలిపాయి. బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ భారత్‌ బంద్‌లో పాల్గొనడంలేదు.

బ్యాంకింగ్, రవాణా రంగాలపై సమ్మె ప్రభావం పడనుంది.  కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కార్మిక యూనియన్లు తప్పుబట్టాయి. కేంద్ర సర్కార్‌ అనుసరిస్తున్న పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక సంస్కరణ విధానాలకు వ్యతిరేకంగా ట్రేడ్‌ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు మద్దతునిస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ కేంద్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డాయి. సహజ వనరులు, ప్రభుత్వ సంస్థల ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెట్టడంలో బిజీగా ఉన్న మోడీ సర్కార్‌ ప్రజలు, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపిస్తున్నాయి.