ట్రెయిన్ 18 కాదు..వందే భారత్ ఎక్స్ ప్రెస్

ట్రెయిన్ 18కు కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ణానంతో తయారైన ట్రెయిన్ 18కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టినట్లు ఆదివారం(జనవరి 27,2019) కేంద్రరైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ట్రెయిన్ 18కు ఏ పేరు పెట్టాలని ప్రజల నుంచి అభిప్రాయాలు కోరగా, వేల సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయని, చివరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ పేరుని తాము ఫైనల్ చేశామని, రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలకు తాము అందిస్తున్న బహుమతి ఇదని, త్వరలోనే మోడీ దీన్ని ప్రారంభిస్తారని గోయల్ తెలిపారు.

 

భారతీయ ఇంజనీర్లు కేవలం 18నెలల వ్యవధిలో ఈ రైలును పట్టాలపైకి తీసుకొచ్చారని తెలిపారు. మేకిన్ ఇండియా కింద ప్రపంచస్థాయి రైళ్లను తయారు చేయవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ అని గోయల్ అన్నారు. ఢిల్లీ-వారణాశి మధ్య 755 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8గంటల్లో కవర్ చేస్తుందని తెలిపారు. కాన్పూర్, ప్రయాగ్రాజ్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుందని తెలిపారు. ఈ రూట్లో ఇదే అత్యంత వేగవంతమైన ట్రెయిన్గా నిలవనుందని తెలిపారు. వచ్చే వారంలో ఈ రైలు పట్టాలపై పరుగులు తీయనున్నట్లు తెలుస్తోంది.