Train Rolls Backwards : తప్పిన భారీ ప్రమాదం.. 35 కిమీ వెనక్కి ప్రయాణించిన ఎక్స్ ప్రెస్ రైలు

ఉత్తరాఖండ్‌లో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించని ఘోరం జరిగిపోయేది. ప్రయాణికులు రైలు చక్రాల కింద నలిగిపోయేవారు. అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు.

Train Rolls Backwards

Train Rolls Backwards : ఉత్తరాఖండ్‌లో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించని ఘోరం జరిగిపోయేది. ప్రయాణికులు రైలు చక్రాల కింద నలిగిపోయేవారు. అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు. మ్యాటర్ ఏంటంటే.. ఓ రైలు వెనక్కి ప్రయాణించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 కిలోమీటర్లు వెనక్కి పరుగులు తీసింది. పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం(మార్చి 17,2021) ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ లోని తనక్‌పూర్‌ వెళ్తోంది. కొంతదూరం బాగానే ప్రయాణించింది. ఇంతలో ఏమైందో కానీ, సడెన్ గా రైలు రివర్స్‌లో ప్రయాణం చేసింది. అలా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాక దానంతట అదే ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్రాక్‌ మీద వేరే రైళ్లు రాకపోవడం.. జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది.

అసలేం జరిగిందంటే..
ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. జంతువును తప్పించడం కోసం డ్రైవర్ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో ఇలా జరిగిందన్నారు. ”సడెన్‌గా పట్టాలపైకి ఓ జంతువు వచ్చింది. దాన్ని కాపాడటం కోసం డ్రైవర్ సడెన్‌ బ్రేక్‌ వేశాడు. అలా సడెన్ గా బ్రేక్ వేసే కమ్రంలో.. ట్రైన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో రైలు దానికదే వెనక్కి ప్రయాణించడం ప్రారంభించింది. ఆ తర్వాత కటిమా అనే ప్రాంతంలో దానంతట అదే ఆగింది. ఆ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీకి 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ సమయంలో రైలులో 60-70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరిని బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు పంపించాము’’ అని చంపావత్‌ ఎస్పీ లోకేశ్వర్‌ సింగ్ తెలిపారు.

కాగా, ఈ ఘటనకు బాధ్యులుగా లోకో పైలెట్‌, గార్డ్‌ని సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటన రైల్వే అధికారులకు, అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ఏం జరుగుతుందో తెలీక అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. మొత్తంగా ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. యూపీ ఫిలిబిత్ నుంచి టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. కటిమా చేరుకున్న టెక్నికల్ టీమ్..అసలేం జరిగింది అనేదానిపై దర్యాఫ్తు చేపట్టింది.