ట్రాఫిక్ ఫైన్‌లు తగ్గించాలనుకుంటున్న రవాణా శాఖ

సెప్టెంబర్ 1 అంటేనే వాహనదారుల గుండెల్లో గుబులు మొదలైంది. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా పోయే వెహికల్స్‌కు భారీగా జరిమానాలు అంటూ కొద్ది రోజుల ముందే ప్రకటించింది కేంద్రం. వీటిపై కాస్త ఉపశమనం లభించేటట్లుగా కనిపిస్తోంది. ఆగష్టు 31గడువు తేదీ అంటూ ప్రకటించిన రవాణా శాఖ.. ఏ విధమైన అధికారిక ఉత్వర్వులు జారీ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రస్తుతమున్న పెనాల్టీలను ఏకంగా 10 రెట్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీనిపై మళ్లీ ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. భారీ మొత్తంలో ఫైన్‌లు ఒకేసారి పెంచితే సాధారణ ప్రజానీకంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. 

దీంతో ఆదివారం నుంచి అమలు చేయాల్సిన నియమాన్ని వెనక్కి తీసుకునేటట్లుగా కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. శనివారం సాయంత్రం రవాశాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ రవాణా శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారీ పెనాల్టీల వల్ల వచ్చే సమస్యలను చర్చించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణలోని అంశాలకు కొన్ని సవరణలు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.