Tuition teacher marries 13-year-old student : ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులివి. సైన్స్ బాగా డెవలప్ అయ్యింది. అలాంటి ఈ రోజుల్లోనూ జాతకాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు వాటిని బలంగా నమ్ముతున్నారు. దోష నివారణ కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు. పిచ్చి పనులు చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి పంజాబ్ లోని జలంధర్ లో జరిగింది. తన జాతకంలో దోష నివారణకు ఓ ట్యూషన్ టీచర్ ఏకంగా 13ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకుంది.
బస్తీ బావా ఖేల్ ప్రాంతంలోని ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఎంతకీ వివాహం కుదరకపోవడంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పూజారిని సంప్రదించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. యువతి జాతకాన్ని పరిశీలించిన పూజారి.. ఆమెకు మాంగళ్య దోషం ఉందని చెప్పాడు. దీని నివారణకు ఆమెకు మైనర్ బాలుడితో ముందుగా పెళ్లి చేయాలని సూచించాడు.
ఈ క్రమంలో తన దగ్గరికి ట్యూషన్ కి వచ్చే విద్యార్థుల్లో ఓ 13ఏళ్ల బాలుడిపై టీచర్ కన్ను పడింది. ఆ పిల్లాడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం స్కెచ్ వేసింది. ట్యూషన్ క్లాసుల కోసం బాలుడు తన దగ్గరే వారం పాటు ఉండాలని విద్యార్థి తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఒప్పించింది. 7 రోజులపాటు ఆ బాలుడిని టీచర్ తన ఇంట్లో పెట్టుకుని పెళ్లి వేడుకలు నిర్వహించింది. అనంతరం తన గాజులు పగలగొట్టి తనకు తాను వితంతువుగా మారిపోయి బాలుడిని ఇంటికి పంపేసింది.
వారం తర్వాత ఇంటికొచ్చిన బాలుడు తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వారు విస్తుపోయారు. బాలుడి కుటుంబ సభ్యులు బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కొడుకుని నిర్భందించి బలవంతంగా హల్దీ వేడుక, మొదటి రాత్రి వంటి ఆచారాలను నిర్వహించారని ఫిర్యాదులో తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే మహిళ ఒత్తిడితో బాధితుడి కుటుంబం ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఇంతలోనే ఈ విషయం పెద్దదైంది. చివరికి సీనియర్ పోలీసు అధికారులకు చేరింది. దీనిపై పూర్తి దర్యాప్తుకు డీఎస్పీ ఆదేశించారు.