Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. సాయిబాబ ఆలయాన్ని కూడా తెరవాలంటూ షిర్డిలో బీజేపీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ(అక్టోబర్-13,2020) ముంబైలోని సిద్ధివినాయక్ ఆలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రసాద్ లాడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుళ్లను తెరవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
కాగా,ఆలయాలు తెరిచే విషయమై సోమవారం గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కరోనా జాగ్రత్తలతో వెంటనే ఆలయాలు తెరుచుకునేందుకు అనుమతివ్వాలని ఆ లేఖలో గవర్నర్ సీఎంకు విజ్ణప్తిచేశారు. ఆ లేఖలో గవర్నర్ ఉద్థవ్ ను ఉద్దేశించి…మీరు బలమైన హిందుత్వవాది. సీఎం అయిన తర్వాత అయోధ్య వెళ్లి శ్రీరాముడిని దర్శించుకొని మీరు మీ భక్తిని బహిరంగంగానే తెలియపరిచారు. ఆషాది ఏకాదశి రోజున పందర్ పూర్ లోని విట్టల్ రుక్మిణి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అయితే, ఆలయాలు తెరవడాన్ని వాయిదా వేసేందుకు మీకేమైనా దైవ సందేశం వచ్చిందా. సెక్యూలర్ అన్న పదాన్ని వ్యతిరేకించే మీరు.. అకస్మాత్తుగా సెక్యూలర్‌గా మారారా అని గవర్నర్ తన లేఖలో సీఎంని ప్రశ్నించారు.
అయితే, గవర్నర్ భగత్ సింగ్ రాసిన లేఖకు సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించడం సరైనది కాదు అని, అలాగే ఒక్కసారిగా లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం కూడా సరికాదు అని సీఎం ఉద్దవ్ తెలిపారు. తాను హిందుత్వను ఫాలో అవుతానని, నా హిందుత్వ భావాలకు మీ సర్టిఫికేట్ అవసరం లేదని గవర్నర్‌కు సీఎం ఉద్దవ్ కౌంటర్ ఇచ్చారు. మీకేమైనా దైవ సందేశం వచ్చిందా అని అంటున్నారు?అలాంటి సందేశాలు మీకు వస్తాయేమో…నాకు అంత ఎక్కువగా రావు అంటూ గవర్నర్ కేంద్రం చేతిలో ఓ పావు అని అర్థం వచ్చేలా ఉద్దవ్ కౌంటర్ ఇచ్చారు.