భారత్‌కు క్షమాపణలు చెప్పిన ట్విట్టర్.. కారణం ఇదే!

  • Publish Date - November 18, 2020 / 06:23 PM IST

Twitter apologised: చైనాలో లడఖ్‌ను చూపిస్తూ తప్పుగా మ్యాప్‌లో చూపించినందుకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పార్లమెంటరీ ప్యానల్‌కు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిందని, ఈ నెలాఖరులోగా లోపాన్ని సరిదిద్దుతామని హామీ ఇచ్చినట్లు కమిటీ చైర్‌పర్సన్ మీనాక్షి లెఖి వెల్లడించారు. భారతదేశం మ్యాప్‌ను తప్పుగా జియో ట్యాగింగ్ చేసినందుకు ట్విట్టర్ సారి చెప్పినట్లుగా చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్(Damien Karien) సంతకం చేసిన అఫిడవిట్ పార్లమెంట్‌కు వచ్చింది.



అంతకుముందు లఢక్‌‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం ట్విట్టర్‌‍ను వివరణ కోరింది. లడఖ్‌ను అలా చూపడం భారత సార్వభౌమత్వ పార్లమెంటు సంకల్పాన్ని బలహీనం చేయడమే అని, ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కేంద్రం ఆరోపించింది. లడక్‌ను మ్యాప్‌లో తప్పుగా చూపించడం ద్వారా భారత ప్రాదేశిక సమగ్రతను ట్విట్టర్‌ అగౌరవ పరిచిందని విమర్శలు చేసింది.



ఈ క్రమంలోనే ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీస్‌ జారీ చేసింది. లఢక్‌ మ్యాప్‌ను తప్పుగా చూపడంపై ఐదు రోజుల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నవంబర్ 9వ తేదీన ట్విట్టర్‌కు నోటీసు ఇచ్చింది. ఐదు రోజుల్లో దీనిపై స్పందించకపోయినా, వివరణ సంతృప్తికరంగా లేకపోయినా సమాచార, సాంకేతిక చట్టం ప్రకారం ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.



అందులో భాగంగానే భారతీయ మనోభావాలను దెబ్బతీసినందుకు ట్విట్టర్ క్షమాపణలు చెప్పింది. 2020 నవంబర్ 30 నాటికి లోపాన్ని సరిదిద్దుతామని ట్విట్టర్ అధికారులు హామీ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు