ఈ రెండూ చేస్తే… NRC,CAA అమలు అడ్డుకోవచ్చు

పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)ను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సీఏఏ,ఎన్ఆర్సీ అమలును నిరోధించేందుకు రెండు చర్యలను సూచించారు ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్. 
 
మొదటిది..అన్ని వేదికలపైనా గళమెత్తి, ప్రశాంతంగా నిరసనలు కొనసాగించడం. రెండవది…బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న 16 రాష్ట్రాల్లో అందరూ కాకపోయినా, అత్యధిక ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఎన్‌ఆర్సీ అమలు చేయబోమని ప్రకటించేలా చేయడం. ఈ రెండు మార్గాలను అనుసరిస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ సీఏఏ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి సహకరించిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ కిశోర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో సమావేశమైన తర్వాత ప్రశాంత్ కాస్త మెత్తబడ్డారు. బిహార్‌లో ఎన్ఆర్సీ అమలు చేయబోమని సీఎం నితీష్ కుమార్ పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే.