Terrorists firing Two soldiers kill : జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హెచ్‌ఎంటి ప్రాంతానికి సమీపంలో గురువారం (నవంబర్ 26, 2020) పెట్రోలింగ్ సైనిక బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు.
ఈ ఇద్దరు సైనికులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపి ఆయుధాలతో పరారయ్యారు. ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్, ఒకరు స్థానికుడు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల కోసం చర్యలు కొనసాగుతున్నాయి.
ఇటీవల నాగ్రోటా సమీపంలోని జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జైషే మొహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే పోలీసులపై దాడి జరగడం గమనార్హం.
నాగ్రోటా కాల్పుల్లో ఇద్దరు అధికారులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు మరోసారి దాడి చేసేందుకు ప్రణాళిక రచించారని, కాశ్మీర్ లోయ వైపు వెళ్లే అవకాశం ఉందని ఆ సమయంలో పోలీసులు హెచ్చరించారు.