పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారి మహ్మద్ ఉమేర్ ఇంకా కాశ్మీర్ లోనే ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జైషే మహమద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్..సోదరుడి కొడుకైన ఉమేర్.. అఫ్గానిస్తాన్ లో ట్రెయినింగ్ పొంది దాడికి పథక రచన చేశాడని తెలిపారు.దాడికి ఉమేర్ సూత్రధారి కాగా, మరో ఇద్దరు ఆర్డీఎక్స్ బాంబును రూపొందించారని ఎన్‌ఐఏ అధికారులు అన్నారు. బాంబును తయారుచేసిన ఇద్దరు ఇప్పటికే సరిహద్దును దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(pok)లోకి వెళ్లిపోగా, ఉమేర్ మాత్రం దాడిని పర్యవేక్షించేందుకు పుల్వామాలోనే ఆగిపోయాడని తెలిపారు. అతని కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయన్నాయి.
ఈ ఆత్మాహుతి దాడి కుట్రో రషీద్ ఘజీ, కమ్రాన్ అనే ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ)తో కలిసి తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. జమ్మూ–కశ్మీర్ జాతీయ రహదారికి సమీపంలో పుల్వామా–పొంపోర్‌ల మధ్య 20–25 కిలోమీటర్ల ప్రాంతం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామనీ, గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.
దాడిలో పాక్ నిఘా సంస్థ ISI చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ ఉత్తర ప్రాంతాల కమాండర్‌గా పనిచేసిన మునీర్‌కు కశ్మీర్‌పై పూర్తి అవగాహన ఉందని ఐఎస్‌ఐ నిపుణులు తెలిపారు. ఐఎస్‌ఐ చీఫ్‌గా మునీర్‌ను గత ఏడాది అక్టోబర్‌లో పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా నియమించారు. పుల్వామా దాడి జరిపిన జైషే మహ్మద్‌తోనే గతంలో కశ్మీర్‌లో ఐఎస్‌ఐ అనేక ఉగ్రవాద కార్యకలాపాలు చేయించింది.