మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంట్ లో పెట్టిన సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావ్, బేటీ పడావ్ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలపై కేంద్ర బడ్జెట్ లో రూ.28,600 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించారు.
మహిళలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ధాన్యలక్ష్మి పేరుతో బడ్జెట్ లో కొత్త పథకాన్ని ప్రకటించింది కేంద్రం. స్వయం సహాయక గ్రూపుల ద్వారా మహిళలకు ఆర్థిక స్వాలంబన కలిగించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం కోసం అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా పేర్లు నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. బాలురు కంటే బాలికలే విద్య నేర్చుకునేందుకు ముందు వరుసలో ఉన్నారని, బాలురు కన్నా 5శాతం ఎక్కువ ఉన్నారని తెలిపారు. అలాగే పౌష్టికాహారం, ప్రధానంగా గర్భిణిలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం కోసం భారీ నిధులను కేటాయించినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా కీలకమైన అంశాన్ని మంత్రి ప్రతిపాదించారు. దేశంలో ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి కనీన వయస్సు 18 సంవత్సరాలు కాగా…. దాన్ని పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెప్పారు. అయితే, దీనిపై సమగ్రమైన అధ్యయనం జరగాలని, అందుకోసం ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వచ్చే 6 నెలల్లో ఈ టాస్క్ ఫోర్స్ తన నివేదికను అందిస్తుందని మంత్రి అన్నారు.
* 6 లక్షల మంది అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు
* పౌష్టికాహారం, ఆరోగ్యం ప్రత్యేక శ్రధ్ద
* 2020-21కి నూట్రిషన్ సంబంధిత కార్యక్రమానికి రూ. 35600 కోట్లు
* 6 నెలల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్