Union Cabinet : కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. అంతరిక్ష రంగంలో 100శాతం ఎఫ్‌డీఐ, చెరకు ఎఫ్‌ఆర్‌పీ ​​8శాతం పెంపునకు ఆమోదం

Union Cabinet : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Union Cabinet : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం (ఫిబ్రవరి 21న) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో అంతరిక్ష రంగంలో ఎఫ్‌డీఐలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అదేవిధంగా చెరకు సేకరణ ధర పెంపునకు కూడా ఆమోదించింది. చెరకు సేకరణ ధరను క్వింటాల్‌కు రూ.315 నుంచి రూ.340కి పెంచేందుకు ఆమోదించింది. చెరకు లాభదాయక ధర (ఎఫ్‌ఆర్‌పీ) క్వింటాల్‌కు రూ.315 నుంచి రూ.340కి 8శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Read Also : ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

క్యాబినెట్ నిర్ణయాలపై మీడియాకు వివరించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ (ఐ అండ్ బి) మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ధరల పెంపు వల్ల చక్కెర కర్మాగారాల ద్వారా రైతులకు చెరకు న్యాయమైన, సరసమైన ధర లభిస్తుందన్నారు. 2024-25కి చెరకు ఎఫ్ఆర్‌పీ క్వింటాల్‌కు రూ. 340 ఉంటుందని చెప్పారు. గత చక్కెర సీజన్‌లో చెరకు ఎఫ్‌ఆర్‌పి క్వింటాల్‌కు రూ.315గా ఉందని తెలిపారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా ఠాకూర్ అన్నారు. రికవరీలో 10.25శాతం కన్నా ఎక్కువ పెరిగిన ప్రతి 0.1 శాతం పాయింట్లకు క్వింటాల్‌కు రూ. 3.32 ప్రీమియం అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 5 కోట్ల మందికి పైగా చెరకు రైతులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

అంతరిక్ష రంగంలో 100శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి :
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడు, ఉపగ్రహాల ఉప-రంగం మూడు విభిన్న కార్యకలాపాలుగా విభజించింది. ప్రతి రంగంలో విదేశీ పెట్టుబడులకు నిర్దిష్ట పరిమితులు ఉన్నాయి.

సవరించిన ఎఫ్‌డీఐ విధానం ప్రకారం.. అంతరిక్ష రంగంలో 100శాతం ఎఫ్‌డీఐ అనుమతిస్తుంది. ఉపగ్రహాల తయారీ మరియు ఆపరేషన్‌లో, ఉపగ్రహ డేటా ఉత్పత్తులలో ప్రభుత్వం ఆటోమేటిక్ రూట్‌లో 74 శాతం ఎఫ్‌డీఐని అనుమతించింది. సవరించిన విధానం ప్రకారం.. అంతరిక్షంలో భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి భారీ పెట్టుబడిదారులను ఆకర్షించనున్నాయి.

నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్‌లో అదనపు కార్యకలాపాలను చేర్చడానికి కూడా క్యాబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం.. గుర్రం, గాడిద, ఒంటెల కోసం సెమెన్ స్టేషన్, న్యూక్లియస్ బ్రీడింగ్ ఫాం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేస్తుంది.

Read Also : YSRCP Polling Booth : వైసీపీ దూకుడు.. ఎన్నికలకు 50 రోజుల ముందే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు