Rajnath Singh : పూలదండ వేస్తుండగా.. స్టేజీపై కిందపడిన మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వీడియో!

ఎన్నికల ప్రచార వేదికపై బీజేపీ కార్యకర్తలు పూలమాల వేస్తుండగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక్కసారిగా పడిపోయారు. పక్కనే ఉన్న సోఫాపై ఆయన పడిన వీడియో వైరల్ అవుతోంది.

Union Minister Rajnath Singh Falls On Stage As Party Workers Scamper To Be Garlanded

Rajnath Singh fall on Stage : పంజాబ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార వేదికపై ఆయనకు బీజేపీ కార్యకర్తలు పూలమాల వేస్తుండగా ఒక్కసారిగా పడిపోయారు. పక్కనే ఉన్న సోఫాపై మంత్రి రాజ్ నాథ్ పడిపోయారు. వెంటనే ఆ పూలదండను తీసుకెళ్లమని ఆయన తమ పార్టీ కార్యకర్తలకు సైగ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ పూలదండ వేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. బీజేపీ పార్టీ కార్యకర్తలు మంత్రి రాజ్‌నాథ్‌కు పూలదండ వేసేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఫొటో ఫ్రేమ్‌లో కనిపించేలా అందరూ ఆయనకు దగ్గరిగా జరిగారు. పార్టీ కార్యకర్తల్లో ఒకరు రాజ్‌నాథ్ సింగ్‌పై పడటంతో ఆయన వెనుకే ఉన్న సోఫాలో పడ్డారు. ఒక్కసారిగా అసహనానికి గురైన రాజ్ నాథ్ వెంటనే ఆ పూలదండను తీసుకెళ్లమని పార్టీకార్యకర్తలకు సూచించారు.

పంజాబ్ సీఎంపై విరుచుకుపడిన రాజ్ నాథ్ : 
ఈ ఘటన నుంచి తేరుకున్న తర్వాత మంత్రి రాజ్ నాథ్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీపై సింగ్ విరుచుకుపడ్డారు. అతను సైన్యం లేని కమాండర్ లాంటివాడని సింగ్ ఎద్దేవా చేశారు. అమృత్‌సర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి సింగ్ మాట్లాడుతూ.. ‘నేను పంజాబ్ ముఖ్యమంత్రిని చూస్తున్నాను. యే తో బినా సైనికో వాలే సేనాపతి హైన్ (అతను సైన్యం లేని కమాండర్ లాంటివాడు) అతను సేనాపతి (ముఖ్యమంత్రి) అయ్యాడు. కానీ అతనికి సైన్యం లేనేలేదు… కానీ కాంగ్రెస్ తనంతట తానుగా పోరాడుతోంది. కాంగ్రెస్‌లో ఇద్దరు బ్యాటర్లు ఒకే క్రీజు కోసం పోరాడుతున్నారు.. వారిద్దరూ ఔట్ కావడం ఖాయమని (క్రికెట్ భాషలో) రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.


‘యూపీ, బీహార్‌కే భయ్యా’ అని వ్యాఖ్యానించిన సీఎం చన్నీపై తీవ్రస్థాయిలో రాజ్ నాథ్ ధ్వజమెత్తారు. విభజించడం ద్వారా కాంగ్రెస్ అధికారం పొందాలనుకుంటుందని సింగ్ విమర్శించారు. విభజించి పాలించు అన్నట్టుగా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన విమర్శించారు. సీఎం చన్నీ వ్యాఖ్యలను సమర్థించిన ప్రియాంక గాంధీ వాద్రాపై కూడా రాజ్ నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే పంజాబ్‌లో మద్యాన్ని నిషేధిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీని సింగ్ కొట్టిపారేశారు. ఢిల్లీలో మద్యం దుకాణాలను తెరిచారని, పంజాబ్‌లో అదే నిషేధిస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

పంజాబ్‌లో మద్యాన్ని నిషేధించేది బీజేపీ మాత్రమే.. 
పంజాబ్‌లో మార్పు గాలి వీస్తోందన్నారు. లోక్ తంత్రం పేరుతో దోపిడి తంత్రాన్ని ప్రజలు సహించరన్నారు. ఒకరు పంజాబ్‌ను దోచుకున్నారు.. మరొకరు ఢిల్లీ నుంచి వచ్చి పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటున్నారని సింగ్ దుయ్యబట్టారు. ఇంతకీ ఆప్ ఏం చేసిందో ఢిల్లీ ప్రజలను అడగండి అని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే మద్యాన్ని నిషేధిస్తామని ఆప్‌ చెబుతోంది. ఢిల్లీ వీధుల్లో మద్యం షాపులు తెరిచిన వారు ఇక్కడ మద్యం నిషేధిస్తామని ఎలా చెబుతున్నారు.. పంజాబ్ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించేది ఒక్క బీజేపీ మాత్రమే’ అని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

Read Also : Rahul Gandhi:పంజాబ్‌ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన రాహుల్ గాంధీ