Nitish Kumar Return to NDA: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి భారతీయ జనతా పార్టీ చెంతకు వెళ్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి విపక్షాల ఐక్యత కోసం నితీశ్ ముందుండి కష్టపడ్డారు. అయితే బెంగళూరులో జరిగిన రెండవ విపక్షాల సమావేశం నుంచి ఆయన అర్థాంతరంగా వెళ్లిపోవడంతో అనేక ప్రశ్నలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆదిపత్యాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, తిరిగి బీజేపీ చెంతకు చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక అనుమానాలకు తావిచ్చే విధంగా స్పందించారు కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రాందాస్ అథవాలె. నితీశ్ తిరిగి ఎన్డీయేలో చేరతారని అన్న ఆయన.. ఆలస్యం చేయకుండా ముంబైలో జరగనున్న విపక్షాల సమావేశాన్ని బహిష్కరించి ఎన్డీయేలో చేరడాన్ని బీహార్ సీఎం పరిశీలించాలని సూచించారు. శనివారం అథవాలే విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహార శైలి ఎన్డీయేకు అనుకూలంగా ఉందని అన్నారు. ఎన్డీయేలో ఉంటూనే తన హయాంలో బీహార్‌ను ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
20 ఏళ్ల క్రితం నాటి బీహార్‌కు, ప్రస్తుత బీహార్‌కు చాలా తేడా ఉందని అథవాలె అన్నారు. ముంబయిలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరించి ఎన్డీయేలో చేరే అంశాన్ని పరిశీలించాలని, ఎన్డీయేలోకి నితీశ్ రావడాన్ని తాము స్వాగతిస్తామని అన్నారు. నితీశ్ కుమార్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పెట్టడంపై నితీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పేరు రాహుల్ గాంధీ సూచించారు. అయితే విపక్షాల కూటమిలో నితీశ్ కు ప్రాధాన్యత లేదని, కానీ బీజేపీలో ఉంటుందని, ఆయనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని అథవాలె గుర్తు చేశారు.
ఇక నితీశ్ ప్రభుత్వం చేపట్టిన కులగణను అథవాలె సమర్ధించారు. తమ పార్టీ చాలా కాలంగా కుల ప్రాతిపదికన గణనను డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. వెనుకబడిన వారితో పాటు సాధారణ కులాలను కూడా లెక్కించాలని అన్నారు. ఈసారి జరిగే జనాభా గణనలో కులాన్ని చేర్చాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని తెలిపారు. బీహార్‌లో దళిత వర్గాలలపై వెనుకబడిన వర్గాల దాడులు, హత్యలు పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దళితుల కోసం మరిన్ని పథకాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చాలా తక్కువని, దీనిపై బీహార్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.