UP bride refuses marry drunken barati : పెళ్లిళ్లలో డ్యాన్సులు సర్వసాధారణంగా మారిపోయాయి. సరదగా చేసే డ్యాన్సులు కాస్త శృతి మించితే మాత్రం అస్సలు బాగుండదు. చూసేవారికి చికాకనిపిస్తుంది. అదే చికాకు పెళ్లికూతురికే వస్తే ఏం జరుగుతుంది? ఇదిగో యూపీలో జరిగిందే జరిగే అవకాశం ఉంది.
ఓ పెళ్లిలో కొంతమంది డ్యాన్సులు వేస్తున్నారు. మందుకొట్టి మరీ చిందులేస్తున్నారు. ఆ చిందులు శృతి మించాయి. పిచ్చి పిచ్చిగా నానా యాగీ చేశారు. కొట్టుకునేదాకా వెళ్లింది. దీంతో పెళ్లికూతురికి తిక్కలేచింది. చిర్రెత్తుకొచ్చింది. అంతే ఛీ..నాకీ పెళ్లి వద్దంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది. దీంతో సదరు మగపెళ్లివారికి దిమ్మ తిరిగిపోయింది.
చిందులేసిన మందుబాబుల పెళ్లి వివరాల్లోకి వెళితే..యూపీలోని పీలీభీత్‌లో ఒక పెళ్లి వేడుకలో మందు బాబులు చిందులు వేయడంతో చిర్రెత్తుకొచ్చిన పెళ్లి కూతురు ఈ పెళ్లి తనకు వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. షాజహాన్‌పూర్ పరిధిలోని మవియాపూర్ నుంచి మగపెళ్లివారు బిస్లండాకు మందీ మార్బలంతో వచ్చారు.
కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి వందమందికి పైగా వచ్చారు. దీంతో ఆడపెళ్లివారు ఈ కరోనా సమయంలో నిబంధనలు ఉన్నాయి కదా..మీరు 100కిపైగా వచ్చారు. మీకు మర్యాదలు చేయటం మాకేమీ ఇబ్బందిలేదు. కానీ కరోనా నిబంధలు కొనసాగుతున్న క్రమంలో జరిగే ఈ సమయంలో ఇలాగైతే సమస్య వస్తుందేమోనని ఆడపెళ్లివారు అన్నారు. దీంతో మగపెళ్లివారి అహం దెబ్బతింది. ఆడపెళ్లివారిదో గొడవకు దిగారు. అప్పటికే మద్యం తాగి డ్యాన్సులేసుకుంటూ వచ్చిన మగపెళ్లివారు మరింతగా ఆడపెళ్లివారిపై రెచ్చిపోయారు. అలా అలా గొడవ పెద్దదైంది.
అది ఎంత వరకూ వెళ్లిందంటే మగపెళ్ళివారు పెళ్లికుమార్తె సోదరుడు, చిన్నాన్నలను కొట్టేదాకా వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న పెళ్లికుమార్తె నాకీ పెళ్లి వద్దని ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో వివాదం మరింత ముదరింది. ఒక ఆడదానికి ఇంత పొగరా? అని మగపెళ్లివాళ్లు మరింతగా రెచ్చిపోయారు. నానా మాటలు అన్నారు. మా పరువు పోయిందంటూ గెంతలేశారు.
ఇలా ఈ గొడవకాస్తా పోలీసుల వరకూ చేరింది. పోలీసులు పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. ఇరుపక్షాలవారినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇటువంటి గొడవలు వస్తుంటాయి. సర్ధుకుపోయి జాగ్రత్తగా పెళ్లి జరగనివ్వండి అని సర్ధిచెప్పటానికి యత్నించారు. కానీ కేవలం కరోనా నిబంధలన గురించి మాట్లాడితేనే ఇంత రాద్ధాంతం చేశారు…ఇది అందరికి మంచిదేకదానే ఉద్ధేశంతో తమ పెద్దవారు ఇలా మాట్లాడారు. ఈపాటిదానికి మద్యం తాగి నానా రభసా చేయటం..నా సోదరుడ్ని తండ్రిలాంటి నా చిన్నాన్నను కొట్టేదాకా వెళ్లిన వీరితో నాకు పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది.
ఆత్మాభిమానాలు మాకున్నాయి. ఇటువంటివారితో నేను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పేసింది. దీంతో మగపెళ్లివారికి తలకొట్టేసినట్లై..ఏం చేయాలో తెలీక తాగిందంతా దిగిపోయా నోరు మూసుకుని తిరిగి వెళ్లిపోయారు. ఆత్మాభిమానంతో మాట్లాడిన ఆ పెళ్లికూతురు నిర్ణయం చాలా చాలా మంచిదేనని పలువురు అంటున్నారు.