Mathura court : మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి పుట్టినస్థలం..ఇక్కడ నమాజులు చేయకుండా ఆపండీ : మథుర కోర్టులో పిటిషన్

మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి పుట్టినస్థలం..ఇక్కడ నమాజులు చేయకుండా ఆపండీ అని డిమాండ్ చేస్తూ..మథుర కోర్టులో పిటిషన్ దాఖలైంది.

Petetion filed in Mathura court..stop namaz in Shahi Edga masjid : మందిరాలు-మసీదుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. హిందూ ఆలయాన్ని కొంత భాగం కూలగొట్టి ఆ ప్రాంతంలో మసీదు నిర్మించారనే అంశంపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనికి సంబంధించి వీడియో సర్వే కూడా జరిగింది. నివేదిక ఇంకా కోర్టుకు అందాల్సి ఉంది. ఈ క్రమంలో శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదులో నమాజులు ఆపాలి అంటూ మథుర కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.దీంతో మసీదులు..మందిరాల విషయంలో వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నట్లుగా ఉంది పరిస్థితి.

ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఉన్న షాహీ ఈద్గా మసీదుపై స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మసీదు ఉన్న ప్రాంతం శ్రీకృష్ణుడి జన్మస్థలమని ఇద్దరు న్యాయవాదులు మథుర కోర్టులో వేరు వేరుగా పిటిషన్లు వేశారు. మసీదు నిర్మాణానికి ముందు ఈ స్థలంలో దేవాలయం ఉండేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఒకటి షాహీ ఈద్గా వద్ద ముస్లింలు నమాజ్ చేయడాన్ని నియంత్రించాలని లక్నోకు చెందిన శైలేంద్ర సింగ్ అనే న్యాయవాది డిమాండ్ చేయగా..మరొకరు హిందూ పిటిషనర్లు మతపరమైన చిహ్నాలను క్లెయిమ్ చేసే ప్రాంగణంలో ఎటువంటి మార్పులు చేయకుండా ఉండేలా సీలు వేయాలని కోరారు. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.జులై 1న విచారణ జరుపుతామని వెల్లడించింది.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది మాట్లాడుతూ..హిందూ దేవాలయం అవశేషాలపై మసీదును నిర్మించారని..ఇక్కడ మసీదు ఉండటం అక్కడ నమాజులు చేయటం సరికాదు అని అన్నారు. శ్రీకృష్ణుడి ఆలయంలో కొంత భాగాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చేశాడని… ఆ తర్వాత అక్కడ మసీదును నిర్మించారని తెలిపారు. మసీదులో నమాజ్ చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని కోర్టును కోరామని తెలిపారు. మరోవైపు ఈ మసీదును తొలగించాలని కోరుతూ గతంలోనే 10 పిటిషన్లు మథుర కోర్టులో దాఖలయ్యాయి. ఇటీవల యూపీకి జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన వాగ్దానాల్లో మథుర ఆలయం కూడా ఉండటం గమనించాల్సిన విషయం.

ట్రెండింగ్ వార్తలు