Umesh Pal Murder Case
Umesh Pal Murder Case: ప్రయాగ్‌రాజ్‌లోని ఉమేష్ పాల్ హత్య కేసులో పోలీసుల వేట కొనసాగుతోంది. ఉమేష్ పాల్ పై కాల్పులు జరిపిన మరో షూటర్ విజయ్ అలియాస్ ఉస్మాన్ ను పోలీసులు సోమవారం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారా ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అయితే, ఈ ఎన్ కౌంటర్ సమయంలో నరేంద్ర అనే కానిస్టేబుల్ కూడా గాయపడినట్లు తెలిసింది. ఎన్‌కౌంటర్ అనంతరం ఉస్మాన్‌ను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు పేర్కొనడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఉమేష్ పాల్ హత్య కేసులో ఉస్మాన్ కీలక నిందితుడు. ఉమేష్ పై మొదటిగా కాల్పులు జరిపిన వ్యక్తి ఉస్మాన్. అతనిపై 50వేల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు.
ఉమేష్ పాల్ హత్యకేసుకు సంబంధించి తాజాగా పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్ రెండోది. ఉమేష్ హత్య జరిగిన మూడోరోజే నిందితుడు అర్బాజ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఈ ఎన్‌కౌంటర్ ధుమన్‌గంజ్ ప్రాంతంలోని నెహ్రూపార్క్‌లో జరిగింది. అసలు విషయంకు వెళితే.. ఉమేష్‌పాల్ అతని ఇద్దరు గన్‌మెన్లను ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్‌లో దుండగులు కాల్చి చంపారు. రాజుపాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ సాక్షిగా ఉన్నాడు. కారు దిగిన ఉమేష్‌పై దుండగులు కాల్పులు జరపడంతో అతనితో పాటు, అతని ఇద్దరు గన్‌మెన్లుకు బుల్టెట్ గాయాలు కావడంతో మరణించారు.
ఉమేష్ పాల్ భార్య జయపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతిక్ అహ్మద్‌తో పాటు అతిక్ సోదరుడు, ఇతరులు మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఉమేష్ పాల్, ఇద్దరు గన్‌మెన్ల పై కాల్పుల ఘటనను యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ లేవనెత్తాడు. దీంతో సీఎం యోగి ఆధిత్యనాథ్ స్పందించి.. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పాడు. ఇదే క్రమంలో గతంలో మాఫియాను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలను యోగి వివరించారు.