UP Rampur : అతనో బాధ్యతగలిగిన విధుల నుంచి రిటైర్ అయిన అధికారి. రిటైర్ అయిన వయస్సు అంటే మంచి చెడ్డలు ఆలోచించే వయస్సు. కానీ అతని అలా చేయలేదు. ప్రతిరోజు తన ఇంట్లో పని చేసే పనిమనిషి రాలేదనే కోపంతో ఆమెను తపాకీతో కాల్చిపడేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. యూపీలోని రామ్‌పూర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
ఇంట్లో పనిచేసే పనిమనిషి ఓరోజు పనిచేసేందుకు రాలేదని ఆగ్రహించిన ఒక రిటైర్డ్ అధికారి ఆమె ఇంటికి వెళ్లి..మరీ ఆమెను తుపాకీతో షూట్ చేసి..హత్య చేశాడు. అడ్డువచ్చిన కొడుకుని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసిన పోలీసులు సదరు రిటైర్డ్ అధికారిని అరెస్టుచేసి..విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..రామ్‌పూర్ పరిధిలోని ఛిద్దావాలా గ్రామంలో రిటైర్డ్ అధికారి సోమపాల్ సింగ్ ఇంటిలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటిపనులు చేస్తుంటుంది. ఈక్రమంలో గత శనివారం (డిసెంబర్ 5,2020) పనిలోకి రాలేనని చెప్పింది.
దానికి సోంపాల్ సింగ్ వ్యక్తి అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. నేరుగా ఆమె ఇంటికెళ్లాడు. పనికి ఎందుకు రాలేదని హుంకరించాడు. దానికి ఆమె ఒంట్లో బాగాలేదు సార్..అందుకే పనిలోకి రాలేని చెప్పాను అంది. అప్పటికీ ఆగ్రహం తగ్గని అతను ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె కొడుకు మధ్యలో కలగజేకుని సోంపాల్ కు నచ్చచెప్పటానికి యత్నించాడు. దీంతో ఆమె కొడుకుపై కూడా దాడి చేశాడు. దానికి ఆమె నా కొడుకుని వదిలేయండి సార్..వాడేం చేశాడని ప్రశ్నించింది.
దీంతో ఆమె జుట్టుపట్టుకుని మెడమీద తుపాకీతో కాల్చాడు. దీంతో అమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సోంపాల్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..నిందితుడు సోమపాల్ ను అదుపులోకి తీసుకున్నామని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.