2019 సివిల్​ సర్వీసెస్​ ఫలితాలు విడుదల… టాపర్ గా ప్రదీప్ సింగ్

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ 2019 పరీక్ష తుది దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు యూపీఎస్​సీ ఫలితాల జాబితాను విడుదల చేసింది. 2019 సివిల్‌ సర్వీసెస్‌కు మెుత్తం 829 మంది ఎంపికైనట్లు యూపీఎస్​సీ తెలిపింది.

ఈసారి UPSC సివిల్స్‌ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్స్ 2019లో హర్యానాకు చెందిన  ప్రదీప్ సింగ్ టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ వరుసగా 2, 3 ర్యాంకులు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లవరపు సూర్యతేజ 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు సాధించారు.

టాపర్ ప్రదీప్ సింగ్ గతేడాది సివిల్స్‌ రాసి ప్రస్తుతం ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్‌గా ట్రెయినింగ్‌లో ఉన్నాడు. తాజాగా సివిల్స్‌లో టాపర్‌గా సత్తా చాటాడు ప్రదీప్. ఆయన తండ్రి గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. రైతు అయిన తన తండ్రి సుఖ్‌బీర్ సింగ్ తనకు స్ఫూర్తి అని చెప్పడం గమనార్హం. గతేడాది సివిల్స్ మెయిన్స్ ఫలితాలలో ప్రదీప్ సింగ్ 260వ సాధించడం తెలిసిందే.

సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియాలో 110 ర్యాంక్ సాధించిన సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఖ్యాతిని సిద్ధిపేట బిడ్డగా దేశ స్థాయిలో చాటారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.

సెప్టెంబర్ 2019న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్… సవిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నిర్వహించింది. ఫిబ్రవరి-ఆగస్ట్ 2020 మధ్య ఇంటర్వ్యూలు, పర్సనాల్టీ టెస్టులు జరిగాయి. అన్నీ వడబోసి, అన్ని కోణాల్లో పరిశీలించి… చివరకు లిస్ట్ విడుదల చేసింది కమిషన్. దాంతో ఎప్పుడు ఇంటర్వ్యూ అవుతుందా, ఎప్పుడు ఫలితాలు వస్తాయా అని ఎదురుచూసిన అభ్యర్థులకు ఫలితాలు వచ్చేయడంతో… ఇక టెన్షన్ తీరిపోయింది. సక్సెస్ అయిన అభ్యర్థుల్ని వారి మెరిట్ ఆధారంగా… సర్వీసుల్లో బాధ్యతలు అప్పగిస్తారు.