పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను కోరారు శిరోమణి అకాలీదళ్((SAD)అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్. రెండు వ్యవసాయ బిల్లులని పునఃపరిశీలనకు మళ్లీ పార్లమెంటుకు పంపాలని కోరారు. రైతులు, కూలీలు, దళితుల శ్రేయస్సు కోసం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని అభ్యర్థిస్తున్నట్లు సుఖ్‌బీర్ తెలిపారు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే రైతులు మనల్ని క్షమించరని సుఖ్‌బీర్ అన్నారు. కాగా, ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రెండు రోజుల క్రితం శిరోమణి అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి కూడా ఆమోదించారు.
వ్యవసాయానికి సంబంధించి ‘ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసు’ బిల్లులకు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఇవాళ రాజ్యసభ ఆమోదించింది. దీంతో వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. మరోవైపు ఈ బిల్లులను రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.