కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఊర్మిళా మటోండ్కర్

  • Publish Date - September 10, 2019 / 09:56 AM IST

బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అప్పగించిన అన్నీ బాధ్యతలకు ఆమె రాజీనామా చేశారు. ముంబైలోని కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు కారణంగానే పార్టీకి తూరం అవుతున్నట్లు ఆమె ప్రకటించారు.

ఏప్రిల్-మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన 45 ఏళ్ల సినీనటి ఊర్మిళా మటోండ్కర్, ముంబై మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షులు మిలింద్ డియోరాకు తన రాజీనామా లేఖను పంపారు.

పార్లమెంటు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఊర్మిళా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ నాయకులు గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు.

ఊర్మిళా మటోండ్కర్ చైల్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏడేళ్ల వయసులో శశి కపూర్-రేఖ జంటగా నటించిన కలియుగ్ (1981)లో నటించింది. 1991లో నరసింహ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

1995లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన రంగీలా సినిమా ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చేసింది. తెలుగులో కూడా రంగీలా సిల్వర్ స్క్రీన్‌ను ఊపేసింది. ఆ తర్వాత సత్య(1998), పింజర్ (2003), మాసూమ్ వంటి సినిమాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.