తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం(USCIRF)అభివర్ణించింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై,భారత ప్రధాన నాయకత్వంపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్లు USCIRF తెలిపింది. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పర్యటనపై ఆంక్షలు విధించిన అమెరికా ప్రభుత్వం, ఆయన ప్రధాని పదవి చేపట్టగానే ఘన స్వాగతం పలకిన విషయం తెలిసిందే.
సోమవారం లోక్ సభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై దాదాపు 12 గంటల పాటు తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణలతో సాగిన చర్చ అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభ సోమవారం రాత్రి ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం ఒక ప్రకటనలో… లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం మమ్మల్ని తీవ్రమైన చిక్కుల్లో పెట్టింది. రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందింతే, హోం మంత్రి అమిత్‌షా, ఇతర ప్రధాన నాయకత్వంపై ఆంక్షలు విధించే విషయాన్ని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తుందని యూసీఐఆర్ఎఫ్ తెలిపింది. ఈ బిల్లులో మతపరమైన కారణాలు తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు తమ అధికార ట్విట్టర్‌లో తెలిపింది. వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే బిల్లులో ముస్లింలను మినహాయించడం ద్వారా మతప్రాతిపకగా పౌరసత్వం కల్పిస్తున్నారనే వాదనకు చోటిస్తోందని తెలిపింది.
అయితే యూఎస్ కమిషన్ ప్రకటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ ప్రకటన దురదృష్టకరమని భారత్ లిపింది. యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ గత రికార్డును చూస్తే దాని ప్రకటన ఆశ్చర్యం కలిగించలేదు. ఏది ఏమయినప్పటికీ, స్పష్టంగా తెలియని విషయంపై దాని పక్షపాతం ద్వారా మాత్రమే మార్గనిర్దేశం చేయటానికి ఈ బాడీని ఎంచుకోవడం విచారకమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పౌరసత్వ (సవరణ) బిల్లుపై యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ చేసిన ప్రకటన ఖచ్చితమైనది కాదని తెలిపింది. సోమవారం లోక్ సభలో హోం మంత్రి అమిత్‌షా కూడా పౌరసత్వ బిల్లు 0.001 శాతం కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రకటించిన విషయం తెలిసిందే. ముస్లింలకు బిల్లు వ్యతిరేకం కాదని అమిత్‌షా సభలో పేర్కొన్నప్పటికీ, మత యుద్ధానికి దారితీస్తుందంటూ శివసేనతో సహా పలు విపక్షాలు గట్టిగా వాదించాయి.