US Tariffs On India : భారత్‌కు మరో షాకిచ్చిన ట్రంప్.. అదనపు సుంకాల మోత.. ఏ రంగాలపై ప్రభావం పడొచ్చు? వాణిజ్య ఒప్పందంపై ప్రభావం ఉంటుందా?

US Tariffs On India : భారత దేశానికి అమెరికా బిగ్ షాకిచ్చింది. భారత దేశం నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 10శాతం అదనపు సుంకాలు (టారిఫ్స్) విధిస్తున్నట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) ప్రకటించింది.

US Tariffs On India

  • అదనపు సుంకాలు విధించిన అమెరికా..
  • భారత్‌ దిగుమతులపై 10 శాతం టారిఫ్స్
  • వాణిజ్య ఒప్పందంపై ప్రభావం ఉంటుందా?

US Tariffs On India : భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తోపాటు మరో 16 దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 10శాతం అదనపు సుంకాలు (టారిఫ్స్) విధిస్తున్నట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) ప్రకటించింది.

Also Read : Telangana RTC Employees : తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. చిరకాల కోరిక నెరవేరబోతోంది..

అమెరికా ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద నిర్వహించిన విచారణలో.. బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను నిరోధించే చట్టాలను ఆయా దేశాలు సమర్థంగా అమలు చేస్తున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. ఈ విచారణ ఆధారంగా కొత్త సుంకాలను ప్రకటించారు.

వివిధ దేశాలు బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను నిషేధించే చట్టాలను అమలు చేస్తున్నాయా లేదా అనే అంశాన్ని అమెరికా పరిశీలించింది. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకున్న లేదంటే తీసుకుంటామని హామీ ఇచ్చిన దేశాలపై 10 శాతం, అలాంటి చర్యలు తీసుకోని దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించింది.

ఈ ఏడాది జూన్ 14న భారత్ తన విదేశీ వాణిజ్య విధానంలో కీలక మార్పులు చేసింది. బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను నిషేధించే నిబంధనలను చేర్చింది. ఈ చర్యలను పరిగణనలోకి తీసుకున్న అమెరికా.. మొదట ప్రతిపాదించిన 12.5శాతం సుంకాన్ని తగ్గించి 10 శాతానికి పరిమితం చేసింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కంబోడియా, యునైటెడ్ కింగ్‌డమ్ సహా మొత్తం 17 దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు అమలు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది.

ఏ రంగాలపై ప్రభావం పడొచ్చు?
తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన అదనపు సుంకాల కారణంగా అమెరికాకు ఎగుమతులు చేసే కొన్ని భారతీయ పరిశ్రమలపై అదనపు వ్యయభారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తయారీ, వస్త్రాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు వంటి రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పందం పరిధిలోని కొన్ని ఉత్పత్తులు, అలాగే చమురు, సహజవాయువు వంటి కొన్ని వస్తువులకు ఈ టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఇచ్చింది.

వాణిజ్య ఒప్పందంపై ప్రభావం ఉంటుందా?
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై తొలి దశ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక రూపురేఖలు ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.