కరోనా ఫైట్ లో గేమ్ ఛేంజర్…BCG వ్యాక్సిన్ వల్లనే భారత్ లో కరోనా కంట్రోల్ లో

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 11లక్షల 30వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా,60వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 3వేలు దాటింది. అయితే ప్రాణాంతకమైన ఈ వైరస్ ను కట్టడిచేసే పూర్తి స్థాయి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేదు.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచవ్యాప్తంగా అనేక బయోటెక్ కంపెనీలు, శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే పూర్తిస్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మాత్రం 18నెలల వరకు పడుతుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇదిలా ఉండగా.. కరోనాకు మలేరియా ట్రీట్మెంట్ లో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు FDA కూడా అఫ్రూవ్ చేసిందని చెప్పిన విషయం తెలిసిందే. 

కాగా.. ఇప్పుడు శతాబ్దం కిందటి మరో వ్యాక్సిన్‌కు కరోనాతో పోరాడే శక్తి ఉందంటూ నెదర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుట్టిన పిల్లలకు TB వంటి వైరస్ లు సోకకుండా పుట్టిన పిల్లలకు బీసీజీ(BCG) అనే వ్యాక్యిన్ ను వాడుతారన్న విషయం దాదాపు భారత్ లో అందరు తల్లిదండ్రులకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ను కరోనాపై పోరాటానికి ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు.

టీకాల ద్వారానే శ్వాసకోశ వ్యాధుల నుంచి శాశ్వత ఉపశమనం ఉంటుందని భావించడం సహజమైనందున.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీజీ ఆశాజనకంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపైనే చూపిస్తోంది. ఇదే సమయంలో ఈ బీసీజీ వ్యాక్సిన్ ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NYIT) పరిశోధకులు కూడా బీసీజీ వ్యాక్సిన్‌ కరోనాపై పోరులో ‘గేమ్‌ చేంజర్‌’గా మారనున్నదని చెప్తున్నారు.  BCG వ్యాక్సిన్ పై సుదీర్ఘ సార్వత్రిక విధానాలు అమలులో ఉన్న దేశాల కంటే.. అమలులోలేని దేశాలు ప్రస్తుతం కరోనా తీవ్రతను ఎక్కువగా చవిచూస్తున్నాయని NYIT శాస్త్రవేత్త గొంఘాలొ ఒటాజు తెలిపారు. ఇందుకు ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్న అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్‌ను ఉదహరించారు.

కాగా.. నెదర్లాండ్స్‌లోని యూఎమ్‌సీ హాస్పిటల్ టీమ్ ఈ వారంలో దీనిపై ప్రయోగం నిర్వహించేందుకు సిద్దమైంది. మొత్తం ఎనిమిది ఆసుపత్రుల నుంచి వెయ్యి మంది హెల్త్‌కేర్ వర్కర్లు ఈ ప్రయోగంలో పాలుపంచుకోనున్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్ టీమ్ కూడా బీసీజీ స్టడీని మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ స్టడీలో ఆస్ట్రేలియా వ్యాప్తంగా 4 వేల మంది హెల్త్‌వర్కర్లు పాల్గొననున్నారు. 

వ్యాక్సిన్‌ కోసం విస్తృత అధ్యయనాలు
ప్రపంచవ్యాప్తంగా రీసెర్చర్లు కోవిడ్-19కు వ్యాక్సిన్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. దాదాపు 187 దేశాలు వినియోగించిన బీసీజీ టీకాపైనా విస్తృత అధ్యయనాలు జరుగుతున్నాయి. చాలా పురాతనమైనదైన బీసీజీ వ్యాక్సిన్‌ కరోనాపై పోరులో సరైన అస్త్రంగా పనిచేస్తుందనే ఆశాభావం చాలా దేశాల శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతున్నది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ శాస్త్రవేత్తలు తమ ఆరోగ్య సిబ్బందిని కరోనా నుంచి రక్షించేందుకు.. వారికి బీసీజీ టీకాలిచ్చి అధ్యయనాన్ని మొదలుపెట్టారు.

మరణాల రేటు తక్కువ..భారత్ చెబుతుందిదే
తాము కూడా బీసీజీ వ్యాక్సిన్ పట్ల ఆశాభావంతో ఉన్నామని,ప్రోత్సహించామని,కానీ ఏదైనా చెప్పడం చాలా తొందరపాటు అవుతుందని భారతీయ నిపుణులు చెబుతున్నారు. కరోనా విషయంలోనూ ఇదొక ఆశాజనకంగా ఉన్నది. ఈ టీకా కరోనా తీవ్రతను తగ్గించవచ్చేమోగానీ పూర్తిగా నిర్మూలించలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని విశ్లేషిస్తే.. బీసీజీ వ్యాక్సిన్‌ను వినియోగించిన దేశాల్లో కరోనా తీవ్రత ఇతర దేశాల కంటే తక్కువగా ఉండటం తాజా ఎన్‌వైఐటీ అధ్యయన ఫలితానికి బలాన్ని చేకూరుస్తుంది. 1948లో భారతదేశం బీసీజీ మాస్‌ ఇమ్యునైజేషన్‌ను ప్రారంభించింది. భారత్ లో కూడా ఇప్పటివరకు కరోనా కేసులు 3వేలకు పైగా నమోదవగా,మరణాలు మాత్రం 80కి లోపే ఉన్నాయని పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్‌ ,యూనివర్సిటీ ఫ్యాకల్టీ మౌనిక గులాటి తెలిపారు.

ఎన్‌వైఐటీ అధ్యయనంలో గుర్తించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ శాస్త్రీయ వివరాలు చాలా అవసరంగా ఉన్నాయని CCMB(సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయలాజీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా చెప్తున్నారు. సార్స్‌ అనే వైరస్‌ను ఎదుర్కోవడంలోనూ బీజీసీ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పనిచేసింది. అంతేకాకుండా రేయింబవళ్లు కరోనా సోకిన పేషంట్ల కోసం శ్రమిస్తున్న డాక్టర్లకు ఇది ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు.

 NYITశాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. జపాన్‌లో 1947లో బీసీజీ టీకా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా, అక్కడ కరోనా మరణాల రేటు 0.28 శాతంగా ఉన్నది. బ్రెజిల్‌లో 1920లో జాతీయ వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టగా.. అక్కడ కరోనా మరణాల రేటు 0.0573 శాతంగా నమోదైంది. 1984లో బీసీజీ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన ఇటలీలో మాత్రం కరోనా మరణాల రేటు ఏకంగా 19.7 శాతంగా ఉన్నది.

Also Read | హ్యాట్సాఫ్, కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు హనిమూన్ వాయిదా వేసుకున్న డాక్టర్ జంట