Man divorces his second wife an hour after marriage in Sambhal District
Divorces-Marriage : పెళ్లి అంటే ఆటలనుకున్నాడో ఏమో ఓ వ్యక్తి మొదటిభార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లికి పెళ్లి పీటలెక్కాడు. వధువుకు తాళి కూడా కట్టాడు. కానీ అక్కడే మొదలైంది అసలు రచ్చ. మొదటి భార్య వచ్చింది పెళ్లి మండపానికి ‘నేను చచ్చానను కున్నావా దర్జాగా మరో పెళ్లి చేసుకున్నావ్’ అంటూ నానా యాగీ చేసింది. బతికి ఉండగానే రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని భర్తతో గొడవకు దిగింది.
ఆమె డిమాండ్ లో కూడా ఏమాత్రం తప్పులేదు. అది ఆమె హక్కు కూడా. దీంతో పెళ్లికొడుకు డంగైపోయాడు. పెళ్లికొచ్చిన పెద్దలంతా ఇదేంటీ నీకు ముందే పెళ్లి అయ్యిందా? మరి రెండో పెళ్లికి ఎలా సిద్దపడ్డావ్ అంటూ తిట్టారు. అన్యాయంగా ఇద్దరి జీవితాలు నాశనం చేశావ్ అంటూ తిట్టిపోశారు. ఏం చేయాలో పాలుపోక నూతన వధువు ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మొదటి భార్య మాత్రం నాకు న్యాయం జరగాల్సిందేనని పట్టుపట్టింది. ఈ గొడవకాస్తా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నూతన వధువు ఆమె తల్లిదండ్రులు పెళ్లికొచ్చిన పెద్దలు వరుడు, పోలీసులు మాట్లాడుకున్నారు. అలా చర్చించుకుని ఓ ఒప్పందానికి వచ్చారు. వధువుకు వరుడితో విడాకులు ఇప్పించి అతని తమ్ముడితో వివాహం జరిపిస్తే బాగుంటందని ప్రతిపాదించారు. అది మొదటిభార్యకు నచ్చింది. సైలెంట్ అయింది. దీంతో గంట క్రితం వివాహం చేసుకున్న అమ్మాయికి విడాకులిచ్చిన భర్త.. ఆమెను తన తమ్ముడికిచ్చి అక్కడే వివాహం జరిపించాడు. దీంతో పోలీసు కేసుల గొడవ లేకుండానే సమస్య పరిష్కారమైంది.
రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి నాలుగేళ్ల క్రితం మొదటి వివాహమైంది. ఆ తరువాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు రెండో పెళ్లికి సిద్దపడ్డారు. ఆ తరువాత జరిగిన కీలక పరిణామాలతో రెండో భార్యకు విడాకులిచ్చి తమ్ముడికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా బాగానే ఉంది పెద్దలు పెళ్లి కొడుకు నిర్ణయించేశారు. మరి వధువుకి ఈ పెళ్లి ఇష్టపడే చేసుకుందా? లేదా పెద్దల బలవంతంతో అంగీకరించి మొదటి భర్త తమ్ముడిని వివాహంచేసుకుందా? అనే విషయం మాత్రం తెలియలేదు.