Vaccination against coronavirus to be voluntary in India భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ స్వచ్ఛందంగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలో ప్రవేశపెట్టే వ్యాక్సిన్ ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మాదిరిగానే ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ప్రధాన వ్యాక్సిన్ లు అన్నీ భారత్ లో చివరిదశ క్లినకల్ ట్రయిల్స్ లో ఉన్నాయని తెలిపింది.
COVID-19 సంక్రమణ యొక్క గత చరిత్రతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ పూర్తి షెడ్యూల్ ని స్వీకరించడం మంచిదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది వ్యాధికి వ్యతిరేకంగా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత వ్యాధి నుంచి మనల్ని కాపాడే యాంబాడీస్ డెవలప్ అవుతాయని తెలిపింది. గురువారం రాత్రి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కరోనా వ్యాక్సిన్ విషయమై పలువురు కొన్ని ప్రశ్నలు సంబంధించగా ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆ ప్రశ్నలకు స్పందించింది. వ్యాక్సిన్ ట్రయిల్స్ ఫైనలేజేషన్ యొక్క వివిధ దశల్లో ఉన్నాయని,త్వరలోనే కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపింది.
కాగా,దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంకి సంబంధించి రాష్ట్రాలకు డిసెంబర్-14,2020 కేంద్ర ప్రభుత్వం 133 పేజీల గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని గైడ్ లైన్స్ లో కేంద్రం తెలిపింది. ఎన్నికల పోలింగ్ బూత్ ల మాదిరిగానే వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. తొలి ప్రాధాన్యం కింద కరోనా ముప్పు అధికంగా ఉండే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు 50ఏళ్లు పైబడినవారికి అంతకంటే తక్కువ వయసువారు ఉండి ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి ఇలా మొత్తంగా 30కోట్ల మందికి ఫేజ్-1లో టీకా ఇవ్వాలని కేంద్రం సూచించింది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటరు జాబితా ఆధారంగా 50 ఏండ్లు పైబడినవారిని గుర్తించాలని కోరింది. జనవరి-1,2021 కటాఫ్ డేట్ ఆధారంగా వయస్సుని లెక్కిస్తారు. జనవరి-1,1971న లేదా అంతకుముందు జన్మించినవారికి ప్రాధాన్యత క్రమంలో భాగంగా మొదటి దశలో వ్యాక్సిన్ అందించనున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్‌ఫాం “CO-WIN” ద్వారా లబ్ధిదారులు వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కు అవకాశం లేదని సృష్టం చేసింది. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని, నేరుగా సెంటర్ల దగ్గరకు వచ్చిన వారికి వ్యాక్సిన్ ఇవ్వకూడదని కేంద్రం గైడ్ లైన్స్ లో సృష్టం చేసింది. కాగా, కరోనా వ్యాక్సిన్ కావాలనుకునే సాధారణ ప్రజలు CO-WIN వెబ్ సైట్ లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇలా ఏదేని ఒక గుర్తింపు కార్డుతో టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని గైడ్ లైన్స్ లో తెలిపింది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు టీకాను ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్నప్రతి ఒక్క వ్యక్తిని 30నిమిషాల పాటు మానిటరింగ్ చేసి ఎవరికైనా ప్రతికూలిస్తే వెంటనే చికిత్స అందజేసేందుకు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కోరింది. కాగా, ఐదుగురు సభ్యులతో వ్యాక్సినేషన్ టీమ్ ఉండాలని… ఒక రోజులో ఒక్కో సెషన్ లో 100-200 మంది లబ్ధిదారులకి వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
వివిధ రకాల వ్యాక్సిన్లతో గందరగోళం ఏర్పడకుండా నివారించేందుకు ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను కేటాయించాలని తెలిపింది. వ్యాక్సిన్ క్యారియర్లు, నిలువ చేసే బాక్సులు, ఐస్ ప్యాక్‌లు నేరుగా సూర్యరశ్మి తలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లబ్ధిదారుడు టీకా తీసుకునేందుకు కేంద్రానికి వచ్చే వరకు వ్యాక్సిన్ ను క్యారియర్ లోపలే ఉంచాలి. కొవిడ్ టీకా లేబుల్‌పై వ్యాక్సిన్ వైయల్ మానిటర్లు(వీవీఎం), గడువు ముగిసే తేదీ ఉండకపోయినా.. అలాంటి వాటిని వినియోగించకుండా పక్కన పెట్టకూడదు. టీకా పంపిణీ ముగిసిన తర్వాత అన్ని ఐస్ ప్యాక్‌లు, తెరవని వ్యాక్సిన్ బాక్సులను తిరిగి కోల్డ్ చైన్ పాయింట్‌కు పంపించాలి. వ్యాక్సినేషన్ గురించి ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గైడ్ లైన్స్ లో కేంద్రం పేర్కొంది.