PM Modi : ప్రాణాలు కాపాడేందుకు,కరోనాని ఓడించేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం

బుద్ధుడి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 'వేసక్​ గ్లోబల్ సెలబ్రేషన్స్‌' లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.

Vaccine Absolutely Important To Save Lives Defeat Covid Pm Modi

PM Modi బుద్ధుడి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘వేసక్​ గ్లోబల్ సెలబ్రేషన్స్‌’ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వర్చువల్​గా పాల్గొన్నారు ప్రధాని. ట్రిపుల్-బ్లెస్డ్ డే గానూ పరిగణించే ఈ వేడుకల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సంఘాల అత్యున్నత అధిపతులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..కరోనాపై పోరాటంలో వ్యక్తిగతంగా, సంస్థలపరంగా ఎందరో సేవలందరించారని, వీరంతా బుద్ధుని బోధలను ఆచరణలో చూపించారని అన్నారు. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్ట్ సంస్థలు, బౌద్ధ ధర్మ అనుయాయులు ఉదార సాయంతో ముందుకు వచ్చి సాటి మానవాళిని ఆదుకున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.

ఈ శతాబ్దంలోనే ప్రపంచం ఇలాంటి మహమ్మారిని చూడలేదని అన్నారు. కోవిడ్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంపై పడిందని, ఆయా దేశల ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసిందని అన్నారు. కరోనా తర్వాత భూగ్రహం కచ్చితంగా ఇప్పుడున్నట్లుగా అయితే ఉండదని మోడీ తెలిపారు. కాలక్రమంలో కరోనా ముందు, కరోనా తర్వాత అంటూ పరిస్థితులను అన్వయించుకోవడం జరుగుతుందని అన్నారు.

కరోనా ఉద్ధృతిలో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి నిస్వార్థ సేవలు అందించిన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లు, వైద్యులు, నర్సులకు తాను మరోసారి సెల్యూట్ చేస్తున్నానని ప్రధాని అన్నారు. కరోనా మహమ్మారిని జయించేందుకు,ప్రాణాలు కాపాడుకునేందుకు వ్యాక్సిన్​ ఒక్కటే మార్గమని తెలిపారు. ఇప్పుడు మనకు మహమ్మారిపై మంచి అవగాహన ఉంది. సరికొత్త వ్యూహాలతో పోరాడగలం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, మహమ్మారిని ఓడించేందుకు వ్యాక్సినే అత్యంత ముఖ్యమైనది. వ్యాక్సిన్ల తయారీ కోసం కృషి చేసిన మన శాస్త్రవేత్తలు దేశానికే గర్వకారణం అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా కోవిడ్‌ తో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.

మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.77 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది. మరో మూడు రోజుల్లో మరో లక్ష డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కేంద్రం ఇప్పటివరకూ 22 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిందని తెలిపింది. ఇందులో 20.13 కోట్లు మాత్రమే వినియోగమయ్యాయని, మిగిలినవి వృధా అయ్యాయని వెల్లడించింది. జాతీయ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్‌ ఇస్తున్నామని పేర్కొంది.