సాధారణంగా ఎవరినైనా పాము కాటు వేస్తే ఏం చేస్తారు.. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తుతారు. కానీ గుజరాత్ లో ఇందుకు విరుద్ధమైన, విచిత్రమైన ఘటన జరిగింది. తనను పాము కరవడంతో ఓ పెద్దాయన(70)కు తిక్కరేగింది. కోపం కట్టలు తెంచుకుంది. ఆ పాముని పట్టుకుని నేలకేసి కసితీరా కొట్టి కొట్టి చంపేశాడు. అంతటితో ఆయన ఊరుకోలేదు. దాన్ని కొరుక్కు తినేందుకు ప్రయత్నించాడు.
మహీసాగర్ జిల్లా అజన్వా గ్రామంలో పర్వత్ గాలా బరియా(70) అనే రైతు తన పొలానికి వెళ్లాడు. అక్కడ ఓ పాము ఆయనను కాటేసింది. సాధారణంగా ఇంకొకరైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లేవారు. బరియా మాత్రం ‘నా పొలంలో నన్నే కరుస్తావా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. చేతిలోని కర్రతో దాన్ని చావగొట్టి, చంపేశాడు. అంతటితో ఆయన కోపం చల్లారలేదో ఏమో.. కానీ.. దాన్ని చేతుల్లోకి తీసుకుని కొంత నమిలి తిన్నాడు. అసలే పాము కాటు, దానికితోడు పామును నమిలి తినడంతో విషం పెద్దాయన శరీరమంతా పాకింది.
పాము కరిచిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బరియాను వెంటనే లునవాడాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గోద్రా సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆలస్యం కావడంతో 4 గంటల పాటు మృత్యువుతో పోరాడిన బరియా చివరికి ప్రాణాలు విడిచాడు. బరియా చంపేసిన పాముకి కుటుంసభ్యులు నిప్పు పెట్టారు. ఈ మంటల్లో పాము కొంతభాగం కాలిపోయింది. ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. పాము కాటేసిందని, దాన్ని చంపి, కొరికి తినడం అందరిని విస్మయానికి గురి చేసింది.