సీనియర్ కాంగ్రెస్ లీడర్ మోతీలాల్ వోరా కన్నుమూత

Motilal Vora dies సీనియర్ కాంగ్రెస్ లీడర్ మోతీలాల్ వోరా(93) కన్నుమూశారు. యూరినరీ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఇటీవల ఢిల్లీలోని ఎస్కార్ట్స్ హాస్పిటల్ లో మోతీలాల్ వోరా చేరిన విషయం తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో రెండు రోజుల క్రితం ఆయనని వెంటిలేటర్ సపోర్ట్ పై ఉంచారు. అయితే సోమవారం(డిసెంబర్-21,2020) మోతీలాల్ వోరా తుదిశ్వాస విడిచారు.

మోతీలాల్ వోరా వృతదేహాన్ని ఛత్తీస్ ఘడ్ లోని ఆయన స్వస్థలానికి తరలించనున్నారు. మంగళవారం అంత్యక్రియలు జరుగనున్నాయి. మరోవైపు,అక్టోబర్ లో కరోనా బారిన పడిన మోతీలాల్ వోరా ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న రెండు నెలల్లోపే ఆయన ఇతర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.

మోతీలాల్ వోరా మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. వోరా జీ నిజమైన కాంగ్రెస్ వ్యక్తి అని,ఒక అద్భుతమైన మానవత్వం ఉన్న వ్యక్తి అని రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో తెలిపారు. వోరాని తాము చాలా చాలా మిస్ అవుతున్నామని తెలిపారు. వోరా కుటుంబసభ్యులకు,శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్.

సమాజ్ వాదీ పార్టీలో 1968లో రాజకీయ జీవితం ప్రారంభించిన మోతీలాల్ వోరా 1970లో కాంగ్రెస్ లో చేరారు. గతంలో మధ్యప్రదేశ్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా మోతీలాల్ వోరా పనిచేశారు. కేంద్ర ఆరోగ్య,పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. కాంగ్రెస్ అధిష్ఠానికి చాలా సన్నిహితంగా ఉండే మోతీలాల్ వోరా.. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఛత్తీస్ ఘడ్ నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక కీలక పదవులు ఆయన నిర్వహించారు. పార్టీ కోశాధికారిగా కూడా మోతీలాల్ వోరా పనిచేసిన విషయం తెలిసిందే.