మేకప్ ఆర్టిస్టులతో ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీద ”ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నెలకు రూ. 80 లక్షలు ఖర్చు చేస్తారంటూ రాసి ఉంది. ఈ వీడియో ఫేస్‌బుక్, ట్విటర్‌లలో వేల సంఖ్యల్లో షేర్ అవగా.. వైరల్ అయిపోయింది. ఆ వీడియోను గురుగ్రామ్ కాంగ్రెస్ అధికార ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. అయితే, ఈ వీడియోలో పేర్కొన్న సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉందని వెల్లడైంది. వీడియో నిజమైనప్పటికీ దానిపై ఉన్న సమాచారం అబద్ధం అని తేలింది.
ఈ వీడియోపైన చెప్పినట్లు మోడీ మేకప్ ఆర్టిస్టులతో మేకప్ వేయించుకోవట్లేదు. ఈ వీడియో మార్చి 2016 నాటిది. మోడీ మైనపు విగ్రహం తయారు చేసేందుకు మేడం టుసాడ్స్ బృందం ప్రధాని నివాసానికి వెళ్లింది. అక్కడ మోడీకి సంబంధించిన కొలతలను తీసుకుంటున్న వీడియో ఇది. నిజమైన వీడియో మేడం టుస్సాడ్స్ యూట్యూబ్ పేజీలో చూడొచ్చు. 2016 ఏప్రిల్ 28న మోడీ మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మేడం టుస్సాడ్స్‌లో పెట్టారు.
ఆర్టీఐ ద్వారా తెలిసిన సమాచారం ఆధారంగా మోడీ తన మేకప్ కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చు చేసినట్లు వీడియోలో ఉంది. అయితే, మోడీపై వచ్చిన ఆర్టీఐ ప్రశ్నల గురించి ప్రధానమంత్రి అధికార వెబ్‌సైట్లో పరిశీలిస్తే అందులో మోడీ మేకప్ ఖర్చుకు సంబంధించిన వివరాలే లేవు. మోడీకి సంబంధించిన విద్యార్హతలు, ఆయన పెట్టిన సెలవులు, ప్రధానమంత్రి కార్యాలయం వై-ఫై స్పీడ్, మోడీ రోజువారీ షెడ్యూల్ వివరాలు మాత్రమే ఉన్నాయి.