Subhash Chandra : నాకొక న్యాయం.. సుభాష్ చంద్రకు ఒక న్యాయమా..? విజయ్ మాల్యా సంచలన ట్వీట్.. మీడియా ప్రశ్నించదా?
Subhash Chandra Insolvency Case : సభాస్ చంద్ర రుణాల రీపేమెంట్ ప్లాన్ కు ఎన్సీఎల్టీ ఆమోదించినట్లు వచ్చిన వార్తలపై వ్యాపారవేత్త విజయ్ మాల్యా స్పందించారు.
- Harish Thanniru
- Updated on- August 28, 2026 / 01:31 PM IST
Vijay Mallya, Subhash Chandra
Subhash Chandra Insolvency Case : జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు వ్యక్తిగత దివాలా కేసులో భారీ ఊరట లభించింది. బ్యాంకులకు, రుణ సంస్థలకు ఆయన చెల్లించాల్సిన బకాయిలు మొత్తం రూ.22,006.57 కోట్లు క్లెయిమ్‌గా ఉంది. అయితే, కేవలం రూ.6.5 కోట్లు చెల్లించే రీపేమెంట్ ప్లాన్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపింది. ఎన్సీఎల్టీ ఆమోదించిన ఈ ప్లాన్ కారణంగా రుణదాతలు దాదాపు 99.97 శాతం నష్టపోవాల్సి వస్తుంది. అంటే రూ.22,006.57 కోట్ల క్లెయిమ్‌లపై కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే రికవరీ అవుతాయి. రికవరీ రేటు సుమారు 0.03 శాతంగా ఉంటుంది.
Also Read : NDA Alliance : కేంద్రంలో మళ్లీ ఎన్డీయే కూటమిదే అధికారం.. తేల్చిన సర్వే.. కానీ.. మొదలైన కష్టకాలం
సుభాష్ చంద్ర ప్రతిపాదించిన రీపేమెంట్ ప్లాన్ కు 2024 నవంబర్ నెలలో జరిగిన రుణదాతల ఓటింగ్ లో 80.814 శాతం ఓటింగ్ షేర్ మద్దతు లభించింది. అయితే, ఈ ప్రతిపాదనను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితర సంస్థలు వ్యతిరేకించాయి. వ్యతిరేకించిన రుణదాతల ఓటింగ్ వాటా మాత్రం 20శాతం కంటే తక్కువగా ఉంది.
అయితే, ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్లాన్ తిరస్కరించి సుభాష్ చంద్రను దివాలా ప్రక్రియలోకి నెట్టడం వల్ల రుణాతలకు మరింత తక్కువ మొత్తమే దక్కే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ట్రిబ్యునల్ ప్రస్తావించింది. ఎందుకంటే.. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ. రీపేమెంట్ ప్లాన్‌లో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే ఆయన ఆస్తుల నుంచి వచ్చే రికవరీ పరిమితంగానే ఉంటుందని ఎన్‌సీఎల్‌టీ పేర్కొంది.
నాకు మాత్రం అన్యాయం చేశారన్న విజయ్ మాల్యా ..
సభాస్ చంద్ర రుణాల రీపేమెంట్ ప్లాన్ కు ఎన్సీఎల్టీ ఆమోదించినట్లు వచ్చిన వార్తలపై వ్యాపారవేత్త విజయ్ మాల్యా స్పందించారు. చాలా మంది రుణ గ్రహీతలు తక్కువ మొత్తాలు చెల్లించి తమ రుణాలను పరిష్కరించుకుంటున్నారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందంటూ ట్వీట్ చేశారు.
మాల్యా ట్వీట్ ప్రకారం.. “ఇది నిజమే అయితే.. నా స్నేహితుడు సుభాష్‌కు హృదయపూర్వక అభినందనలు. రూ.6,203 కోట్ల జడ్జ్‌మెంట్ డెట్‌కు గాను బ్యాంకులు, ప్రభుత్వం నా నుంచి రూ.14,100 కోట్లు రికవరీ చేసినట్లు అంగీకరించాయి. కానీ, ఎంతోమంది రుణగ్రహీతలు అసలు బకాయిలో కొంత భాగానికే సెటిల్‌మెంట్ చేసుకున్నారు. ఇదే భారతీయ రుణ పరిష్కార న్యాయమని అనుకోవాలా? ఈ విషయంపై మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలు లేవు.” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
