ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఖర్గేను కలిసిన వినేశ్ ఫొగాట్.. సాక్షి మాలిక్ ఏమన్నారో తెలుసా? తనకూ ఆఫర్లు వచ్చాయంటూ..

హరియాణాలో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా..

హరియాణాలో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వారిద్దరు కలిశారు. రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫొగాట్ రాజీనామా చేసి, ఎక్స్‌లో ఆ లేఖను పోస్ట్ చేశారు.

రైల్వే ఉన్నతాధికారులకు రాజీనామా లేఖను పంపినట్లు వినేశ్ ఫొగాట్ తెలిపారు. భారతీయ రైల్వేకు సేవ చేయడం తన జీవితంలో మరపురాని, గర్వించదగిన సమయమని ఆమె పేర్కొన్నారు. తాను రైల్వే సర్వీస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

దేశానికి సేవ చేయడానికి రైల్వే తనకు ఇచ్చిన ఈ అవకాశానికి తాను భారతీయ రైల్వేకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిగా ఉంటానని తెలిపారు. కాగా, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

నా పోరాటం ఆగదు: సాక్షి మాలిక్
వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందిస్తూ.. అది వారి వ్యక్తిగతమని చెప్పారు. అయితే, పోరాటం చేస్తే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. మహిళల కోసం చేస్తున్న తమ పోరాటం తప్పుడు అభిప్రాయాలు ఇవ్వకూడదని చెప్పారు.

తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని అన్నారు. తనకు కూడా కొన్ని ఆఫర్లు వచ్చాయని, కానీ, తాను మొదలు పెట్టిన పోరాటంలో చివరి వరకు ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్‌ను ప్రక్షాళన చేసి, మహిళలపై దోపిడీని అంతం చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని, పోరాటం నిజమైనదని అన్నారు.

Also Read: జీవన్‌రెడ్డి.. మరోసారి తన రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తారా?

ట్రెండింగ్ వార్తలు