కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ?
ముందు నుంచి ఊహించినట్టుగానే జరిగింది. భారత స్టార్ రెజర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరనున్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Updated on- September 17, 2024 / 01:36 PM IST
Vinesh Phogat, Bajrang Punia joined Congress
Vinesh Phogat, Bajrang Punia : భారత రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరనున్నారు. వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. జులనా నియోజకవర్గం నుంచి వినేశ్ ఫోగట్, బద్లీ అసెంబ్లీ స్థానం నుంచి బజరంగ్ పునియా పోటీకి రెడీ అవుతున్నారు. ఢిల్లీలో ఇవాళ మధ్యాహ్నం వీరిద్దరు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. ఫోగట్, పునియా చేరిక కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారే అవకాశముంది. హర్యానా రైతులతో వినేశ్ ఫోగట్ మంచి అనుబంధం ఉంది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అన్నదాతలకు ఆమె అండగా నిలిచారు. అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, అప్పటి బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరు కాంగ్రెస్ లో చేరడం తమ పార్టీకి ప్లస్ అవుతుందని హైకమాండ్ భావిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు..
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులకు సర్ది చెబుతున్నారు. ఓట్లు చీలకుండా ఉండాలంటే ప్రతిపక్షాలు కలికట్టుగా ఉండాలని ఆయన అంటున్నారు. మరోవైపు సీట్ల షేరింగ్ పై రెండు పార్టీలు చర్చలు కొనసాగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. అయితే ఏడు సీట్లు కంటే ఎక్కువ ఇవ్వబోమని కాంగ్రెస్ చెబుతోంది. ఇండియా బ్లాక్‌లో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి ఒక్క సీటు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
అక్టోబర్ 5న ఎన్నికలు
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికలు వెలువడనున్నాయి. సెప్టెంబర్ 5న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. సెప్టెంబర్ 12 వరకు నామినేషన్ల దాఖలు చేయవచ్చు. సెప్టెంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 16 వరకు ఈసీ గడువు విధించింది.
Also Read : జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల హీట్.. ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన నేతలు.. మోదీ పర్యటన ఎప్పుడంటే?
