ఇక పర్యటించండి : ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ లోకి టూరిస్టులకు అనుమతి

ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులు, పర్యాటక రంగం కోసం తెరిచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఇవాళ(అక్టోబర్-21,2019)లడఖ్ లో పర్యటించన ఆయన….పర్యాటకులు సియాచిన్ లో పర్యటించవచ్చన్నారు. సియాచిన్ బేస్ క్యాంప్ నుండి కుమార్ పోస్ట్ వరకు మొత్తం ప్రాంతాన్ని పర్యాటక ప్రయోజనాల కోసం తెరిచారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

లడఖ్ లోని షియోక్ నది దగ్గర నిర్మించిన వ్యూహాత్మక “కల్నల్ చెవాంగ్ రించెన్ బ్రిడ్జ్”ను ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, తదితరులతో కలిసి రాజ్ నాథ్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్‌తో సులభంగా అనుసంధానం చేస్తుంది. లడఖ్ పర్యాటక రంగంలో విపరీతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని రాజ్ నాథ్ అన్నారు. లడఖ్‌లో మంచి కనెక్టివిటీ పర్యాటకులను అధిక సంఖ్యలో తీసుకువస్తుందన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేసిన తరువాత,లడఖ్ ప్రాంతం ఇప్పుడు స్నేహితులను మాత్రమే ఆకర్షిస్తుందని, శత్రువులకు అవకాశం ఇవ్వలేదని ఆయన చెప్పారు.

అయితే మన పొరుగు దేశం పాక్ జవాన్లపై  మన సాయుధ దళాలు ఎప్పుడూ దాడి చేయలేదన్నారు. భారత్ ఎప్పుడూ మొదట కాల్పులు చేయలేదన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశం  సమగ్రతను అస్థిరపరచడానికి, బలహీనపరచడానికి  పాక్ వైపు నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భారత ఆర్మీ అటువంటి ప్రయత్నాలకు తగిన బుద్ధి చెప్పిందని,పాక్ ఇప్పటికి కూడా మారకపోతే భారత ఆర్మీ తగిన బుద్ధి చెబుతూనే ఉంటుందన్నారు.