పహల్గాంలో ఉగ్రదాడి లైవ్ వీడియో.. జిప్ లైనర్ మీద టూరిస్ట్ తీసిన వీడియో వైరల్..

కింద పరుగులు తీస్తున్న వారిలో ఒకరు కింద పడిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఉగ్రదాడి జరుగుతున్న వేళ అక్కడ ఓ పర్యాటకుడు అనుకోకుండా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిప్ లైనర్ మీద ఎంజాయ్‌ చేస్తున్న ఆ పర్యాటకుడు సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు.

అదే సమయంలో కింద ఉగ్రదాడి జరిగింది. ఆ పర్యాటకుడి పేరు రిషి భట్. అతడు పహల్గాంకు అహ్మదాబాద్ నుంచి వచ్చాడు. అతడు సరిగ్గా జిప్ లైనర్ మీద వెళ్తున్న సమయంలోనే కింద ఉగ్రదాడి జరిగింది. 53 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఆ దృశ్యాలన్నీ కనపడ్డాయి.

రిషి భట్ సెల్ఫీ స్టిక్‌ వాడుతూ ఈ వీడియో తీశాడు. అతడు పైన వెళ్తున్న సమయంలో కింద ఇతర పర్యాటకులు ఉగ్రవాదుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. కింద పరుగులు తీస్తున్న వారిలో ఒకరు కింద పడిపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

Also Read: పాకిస్థాన్ ఆర్మీలో భయమా? తిరుగుబాటా?.. సంచలనం సృష్టిస్తున్న లేఖలు.. వైరల్

తుపాకుల చప్పుడు వినపడిన సమయంలో జిప్ లైన్‌ ఆపరేటర్ మూడుసార్లు అల్లాహు అక్బర్‌ అని అన్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిషి భట్ తెలిపాడు. తాను తీసిన ఆ వీడియోను ఆ తర్వాత రోజు తాను చూశానని, జిప్ లైన్‌ ఆపరేటర్ అల్లాహు అక్బర్‌ అని అన్న తర్వాత కాల్పులు మొదలైనట్లు తాను గ్రహించానని రిషి భట్ చెప్పాడు.

తన రైడ్ ప్రారంభమైన వెంటనే కాల్పులు మొదలయ్యాయని, తాను రైడ్ చేయకముందే తన భార్యపిల్లలు రైడ్ చేశారని అన్నాడు. తాను దూరంగా జిప్ లైనర్ దిగి చూశానని, నీ మతం ఏంటి? అని అడుగుతూ ఓ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని తెలిపాడు. తాను జిప్‌లైన్ దిగిన వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి పరుగులు తీశానని చెప్పాడు. ఉగ్రదాడి జరిగిన 20 నిమిషాల తర్వాత ఆర్మీ వచ్చి పర్యాటకులందరినీ ఒక్కదగ్గరకు చేర్చి రక్షణగా నిలిచారని తెలిపాడు.