బిడ్డ ఆకలికి కదిలిన ఖాకీ గుండె.. రైలు వెనుక పరిగెత్తి పాలు ఇచ్చాడు

  • Publish Date - June 5, 2020 / 01:11 AM IST

ఖాకీ గుండె కటువు అంటారు కదా? కానీ ఈ రైల్వే పోలీసు గుండె ఓ బిడ్డ ఆకలికి కరిగిపోయింది. అయితే ఆయన చేసినపనికి ఇప్పుడు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భోపాల్‌లోని ఒక రైల్వే స్టేషన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ ఒక బిడ్డకు పాలు అందించడానికి కదిలే రైలు కోచ్ వైపు పరిగెత్తుతూ వెళ్లడం సీసీటీవిలో కనిపించింది. ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లే రైలు కొన్ని నిమిషాలు భోపాల్ స్టేషన్‌లో ఆగింది.

ఆ సమయంలో ఓ బిడ్డ తల్లి షఫియా హష్మి తన బిడ్డకు పాలు కావాలంటూ ఆర్‌పిఎఫ్ అధికారి ఇందర్ యాదవ్‌ను సహాయం కోరింది. దీంతో బిడ్డకు పాలు తెచ్చేందుకు వెళ్లాడు యాదవ్. అయితే పాలు తెచ్చేప్పటికే రైలు కదలింది. దీంతో అతను కదిలే రైలు కోచ్ వైపు దూసుకెళ్లి పాల ప్యాకెట్‌ను బిడ్డ తల్లికి ఇచ్చాడు. తన సర్వీస్ రైఫిల్‌ను ఒక చేతిలో, మరోవైపు పాల ప్యాకెట్‌ను పట్టుకుని కానిస్టేబుల్ పరిగెత్తిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

తన బిడ్డకు పాలు అందించలేనని, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ రాలేడని నిర్ణయించుకుని, బిస్కెట్లను నీటితో తినిపించాల్సి వచ్చిందని ఆ మహిళ తెలిపింది. తన స్వస్థలం చేరుకున్న ఆ మహిళ రైల్వే పోలీసు ఇందర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలుపింది. ఒక హీరోలాగా తన బిడ్డ ఆకలి తీర్చాడని చెప్పింది. ఈ ఘటన రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి వెళ్లడంతో, రైల్వే పోలీసు ఇందర్ యాదవ్‌ను ఆయన కూడా అభినందించారు. నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

Read:  2557 మంది పోలీసులకు కరోనా