Violation Corona Rules : కరోనా నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి వేడుకలు..వధూవరులతో సహా 31 మంది అరెస్ట్

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లఘించి పెళ్లి సంబరం చేసుకుంటున్న వారికి వెస్ట్‌ త్రిపుర జిల్లా కలెక్టర్ డాక్టర్ శైలేష్ కుమార్ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు.

Wedding ceremonies in violation of corona rules : కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి సంబరం చేసుకుంటున్న వారికి వెస్ట్‌ త్రిపుర జిల్లా కలెక్టర్ డాక్టర్ శైలేష్ కుమార్ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రెండు పెళ్లి మండపాలకు పోలీసులతో సహా చేరుకున్న కలెక్టర్.. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి కోవిడ్ వ్యాప్తి కారణమయ్యారనే కారణంతో వధూవరులతో సహా 31 మందిని అరెస్ట్ చేయించారు.

ఇందులో 19 మంది మహిళలు ఉన్నారు. అంతటితో ఆగకుండా వేడుక జరుగుతున్న రెండు ఫంక్షన్‌ హాళ్లపై డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద రెండేళ్ల పాటు నిషేధం విధించారు. ఈ ఘటన త్రిపుర రాజధాని అగర్తలాలో చోటు చేసుకుంది.

కరోనా కట్టడికి త్రిపుర నైట్‌ కర్ఫ్యూ విధించింది. అయితే ఈ నిబంధనలు పట్టించుకోకుండా చాలా మంది ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన కలెక్టర్‌ శైలేష్‌ యాదవ్‌ తానే స్వయంగా సీన్‌లోకి దిగారు. కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుగుతున్న రెండు కళ్యాణ మండపాలపై శైలేష్‌ రైడ్‌ చేశారు. ముందు సైలెంట్‌గా వెళ్లిన కలెక్టర్‌.. అక్కడ పరిస్థితులను చూశారు.

ఓ అతిధి మాదిరి వేడుకకు వచ్చిన తర్వాత.. ఒక్కసారిగా తానేమిటో చూపించారు. సమయం దాటినప్పటికీ వేడుకలో ఉన్న వారిని బయటకు పంపేశారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన పెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుపైనే కేసులు నమోదు చేశారు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు కలెక్టర్‌ శైలేష్‌. ఓ వైపు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే.. మీరేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌ ఇంఛార్జ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌ ఉన్నతాధికారులకు సిఫార్స్‌ చేశారు. అయితే దాడి చేసిన తర్వాత కలెక్టర్‌ పెళ్లి వారికి క్షమాపణలు చెప్పారు. ఎవరిని బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, కరోనా ప్రమాదం నుంచి ప్రజలను కాపాడే లక్ష్యంతోనే కఠినంగా వ్యవహరించానంటూ చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు