మెరుపు దాడుల వాస్తవాలు వెల్లడించాలి

పాక్ లోని బాలా కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెల్లడించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అసలు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం(ఫిబ్రవరి-28,2019) మమతా బెనర్జీ మాట్లాడుతూ.. సైన్యానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. దాడులకు సంబంధించిన వాస్తవాలను తెలియజేయండి

300మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియా వీటిని ఖండిస్తోంది. మాకు వాస్తవాలు కావాలి. మీరు సరిగ్గా టార్గెట్ మీదనే బాంబులు వేశారా..లేదా చెప్పండి. ఒక వేళ మీ ప్రయత్నం విఫలమైతే ఒక్కరు కూడా చనిపోరు కదా. దీని కోసమే వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నామన్నారు. పుల్వామా, మెరుపు దాడుల తర్వాత ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా జవాన్ల త్యాగాలను రాజకీయ లబ్థి కోసం వాడుకుంటే సహించమని మమత తెలిపారు.