ఎగరని బీజేపీ జెండా..తృణముల్ క్లీన్ స్వీప్

  • Publish Date - November 28, 2019 / 11:44 AM IST

పశ్చిమ బెంగాల్‌లో పాగా వేద్దామని అనుకుంటున్న బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. తమకు ఢోకా లేదని తృణముల్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ క్వీన్ స్వీప్ చేసింది. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ధీటుగా పోటీనివ్వలేకపోయారు. టీఎంసీ పార్టీకీ ప్రజలు పట్టం కట్టారు. 
ఖరగ్ పూర్ సర్దార్‌లో తృణముల్ పార్టీ క్యాండిడేట్ ప్రదీప్ సర్కార్ బీజేపీ అభ్యర్థి ప్రేమ్ చంద్ర ఝాపై 20 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దిలీప్ మేదినపూర్ నుంచి గెలిచి పార్లమెంట్‌కు వెళ్లారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. 
కరీంపూర్ నియోజకవర్గంలో తృణముల్ అభ్యర్థి బీమలెందు సిన్హా..సమీప బీజేపీ అభ్యర్థిపై 24 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన..తృణముల్ ఎమ్మెల్యే మొహువా మిత్రా లోక్ సభ ఎన్నికల్లో గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 
కలియాగంజ్ నియోజకవర్గంలో తృణముల్ అభ్యర్థి తపన్ దేవ్ సిన్హా..బీజేపీ అభ్యర్థిపై 2 వేల 418 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమతనాథ్ రాయ్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రమతనాథ్ రాయ్ కుమార్తె ధృతశ్రీని కాంగ్రెస్ బరిలోకి దించినా..ఫలితం లేకపోయింది.