బిజీ షెడ్యూల్ : ఆఫీసులోనే IPS, IAS ఆఫీసర్ల పెళ్లి

  • Publish Date - February 15, 2020 / 05:14 PM IST

అవును మీరు వింటున్నది నిజమే. బిజీ షెడ్యూల్ కారణంగా మహిళా ఐపీఎస్, ఓ ఐఏఎస్ అధికారులు ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీరిది ప్రేమ వివాహం. బిజీ షెడ్యూల్ కారణంగా వీరి వివాహం వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు ప్రేమికుల రోజునే పెళ్లి చేసుకోవాలని భావించి..ఆఫీసుకు రిజిష్ట్రార్‌ను పిలిపించుకుని..ఇద్దరూ పూలదండలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే…
తుషార్ సింగ్లా..2015లో IASకు ఎన్నికయ్యారు. కోల్ కతాలోని ఉలిబెరియాలో SDOగా పనిచేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన నవజోత్ సిమీ 2017లో బీహార్ కేడర్‌ నుంచి IPSకు ఎన్నికయ్యారు. ఈమె పట్నాలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఏడాది క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇది కాస్తా..ప్రేమగా మారిపోయింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే..వెస్ట్ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ క్రమంలో..తుషార్ సింగ్లా చాలా బిజీ అయిపోయారు.

పెళ్లిని తరచూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక లాభం లేదని అనుకుని..ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. నవజోత్ సిమీ పాట్నా నుంచి కోల్ కతాకు వెళ్లారు. అక్కడ సింగ్లా ఆఫీసులో రిజిస్ట్రార్‌ను పిలిచి..ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఫార్మల్‌గా తుషార్ తయారు కాగా..సిమీ ఎర్రటీ చీర ధరించారు. వధూవరుల కుటుంబసభ్యులు, ఆఫీసు సిబ్బంది హాజరయ్యారు. అనంతరం వీరు..ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

ఆఫీసులో పెళ్లి ఏమిటీ అంటూ ప్రశ్నలు వినిపించాయి. దీనిపై రాష్ట్ర మంత్రి, హౌరా జిల్లా అధ్యక్షుడు అరూప్ రాయ్ స్పందించారు. ఇందులో తప్పేమీ లేదని చెప్పారు. రిజిస్టర్ వివాహం అనేది చట్టంలో పేర్కొందని, ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన పెళ్లి..విషయంలో ఎలాంటి ప్రశ్నలకు తావులేదన్నారు. కేవలం పెళ్లి మాత్రమే జరిగిందని, విందు జరగలేదన్నారు. 2021లో బెంగాల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత..గ్రాండ్‌గా రిసెప్షన్ చేస్తామంటున్నారు ఈ నూతన వధూవరులు. 
Read More : డబ్బులు డ్రా చేస్తున్నారా : ATM విత్ డ్రా..కాస్ట్‌లీ గురూ!,ఏం తెలివి : సీసీ కెమెరా డైరెక్షన్ మార్చి భారీ చోరీ