Mukul Sangma: ప్రశాంత్ కిషోర్ టీమ్ ఎంట్రీ.. మాజీ సీఎం రాజీనామా?

మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డాక్టర్ ముకుల్ సంగ్మా రేపు(03 అక్టోబర్ 2021) ఢిల్లీకి రానున్నారు.

Prashanth Kishore

Mukul Sangma: మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డాక్టర్ ముకుల్ సంగ్మా రేపు(03 అక్టోబర్ 2021) ఢిల్లీకి రానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో అంతర్గత సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి సంగ్మా ఢిల్లీ వెళ్తున్నారు. విసెంట్ హెచ్ పాలాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసినందుకు సంగ్మా కలత చెందారని, 12 మంది ఎమ్మెల్యేలతో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే సంగ్మా ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. అయితే, డాక్టర్ సంగ్మా ఈ ఊహాగానాలను తోసిపుచ్చలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మేఘాలయలో కాంగ్రెస్‌కు ఇప్పుడు 17 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 12మంది డాక్టర్ సంగ్మా వైపే ఉన్నారని సంగ్మా వర్గీయులు చెబుతున్నారు. 2023 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో, ఎమ్మెల్యేలు తమ స్థానాన్ని నిలుపుకోవాలని భావిస్తుండగా.. 60సీట్లు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మేఘాలయలోని అనేక మంది కాంగ్రెస్ నాయకులతో పార్టీ అగ్రనేతతో కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం టచ్‌లో ఉందని, తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఎంట్రీ తర్వాత ముకుల్ సంగ్మా కాంగ్రెస్‌ను వీడ‌నున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. తృణ‌మూల్ కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసే దిశ‌గా మేఘాల‌య‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు చెబుతున్నారు.